Thursday, May 2, 2024
- Advertisement -

హిందీపై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం

- Advertisement -

దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో హిందీ భాష దోహదపడుతుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. తాను మొదట భారతీయుడ్ని అయినందుకు గర్వపడుతున్నాను.. ఆ తర్వాత తెలుగువాడ్ని… తదుపరి తెలంగాణవాసినంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను మాతృభాష తెలుగులో మాట్లాడతాను.. ఆ తర్వాత ఆంగ్లం, హిందీ, కొంచెం ఉర్దు భాషలో కూడా మాట్లాడతానని స్పష్టం చేశారు. అంతే కానీ ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలంటూ మాపై రుద్దడం ఆపాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతదేశంలో ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని అమిత్ షాకు కేటీఆర్ హితవు పలికారు. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన సువిశాల భారతదేశంలోని వేరువేరు రాష్ట్రాల ప్రజలు హిందీ భాషలోనే మాట్లాడుకోవాలనడం ఆపాలని సూచించిన కేటీఆర్.. తక్షణమే అమిత్‌షా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమిత్ షా వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ‘తమిళ తల్లి’ ఫోటోను షేర్ చేసిన రెహమాన్… ‘ప్రియమైన తమిళం మన ఉనికికి మూలం’ అనే వాక్యాన్ని ఆ పోస్టుకు జోడించారు. తమిళ కవి భారతీ దాసన్ ‘తమిళియక్కమ్’ కవితా సంకలనంలోని లైన్ అది. అమిత్ షా ‘హిందీ’ కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ రెహమాన్ ఈ పోస్టుతో కౌంటర్ ఇచ్చినట్లయింది. అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు భగ్గుమంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ సిద్ధారామయ్య తీవ్రంగా స్పందించారు. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దడం సాంస్కృతిక ఉగ్రవాదమని మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ ఐక్యతపై దాడిగా అభివర్ణించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. దేశ బహుళత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందన్నారు.

ప్రభుత్వాన్ని నడిపే మాద్యమమే అధికార భాషగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు. తద్వారా హిందీ భాషకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అది దేశ ఐక్యతకు దోహదపడుతుందన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల వ్యక్తులతో మాట్లాడినప్పుడు హిందీలోనే మాట్లాడాలన్నారు. ఈ కామెంట్లే రచ్చగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -