Monday, April 29, 2024
- Advertisement -

పార్వతీపురం టీడీపీ టికెట్ వైఎస్ఆర్ సీపీ నేతకేనా ?

- Advertisement -

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తున్న టీడీపీ నేతలు, అదే నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్ సీపీ మధ్యపాన నిషేధ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి వైపు ఆశగా చూస్తున్నారు. 2009లో వైఎస్ఆర్ ఆశీస్సులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సవరపు జయమణి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అన్నివర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా సౌమ్యురాలు, మృదుస్వభావి అయిన జయమణి వివాదాలకు దూరంగా పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉంటూ పని చేసుకుంటూ వచ్చారు. 2009 నుంచి 2014 వరకూ ఎమ్మెల్యేగా ఆమె పని తీరు పార్వతీపురం నియోజకవర్గ ప్రజల మనన్నలు అందుకుంది.

ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా ఎదిగిన జయమణి 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీలో చేరారు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో చేరాలని ఎన్నో విధాలా కోరినా జయమణి నిరాకరించారు. తమకు రాజకీయ జీవితం ప్రసాదించిన వైఎస్ఆర్ వారసుడితోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని నాడు స్పష్టం చేస్తూ వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆ పార్టీలో చేరడంతోనే వారికి సముచిత స్థానం కల్పించారు వైఎస్ జగన్. జయమణిని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో పాటు, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మధ్యపాన నిషేధ కమిటీ మెంబర్ బాధ్యతలూ అప్పగించారు. అప్పటి నుంచీ జయమణి వైఎస్ఆర్ సీపీలో విశ్వసనీయ నాయకుల్లో ఒకరిగా ఉంటూ పార్టీ పెద్దలు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ పార్వతీపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్‌ఆర్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పి.సాంబశివరాజుతో పాటు ఇతర నేతల ఆశీస్సులతో టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే నియోజకవర్గంలో మంచి పేరు ఉండటంతో పాటు ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న జయమణిని టీడీపీలో చేర్చుతానని ఇప్పటికే చంద్రబాబు వద్ద మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెప్పినట్లు సమాచారం. బొబ్బిలి నియోజకవర్గం టికెట్ తనకు ఇవ్వడంతో పాటు పార్వతీపురం టీడీపీ టికెట్ జయమణికి ఇచ్చినట్లయితే ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని సుజయ్ కృష్ణ ధీమా వ్యక్తం చేశారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోకముందే, ఆ స్థానంలో వైఎస్ఆర్ సీపీ నుంచి జయమణిని బరిలో దింపకముందే, ఆమెను టీడీపీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇస్తే మంచిదని ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం.

వైఎస్ఆర్ సీపీలో ఉన్నా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్న జయమణి అభ్యర్ధిత్వం పట్ల విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజయ్ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగధీష్ సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి ఒత్తిడితో జయమణి పార్వతీపురం టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగితే వైఎస్ఆర్ సీపీ, ఓ గెలుపు గుర్రాన్ని కోల్పోయినట్లేనని జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాబు ఎత్తుకుపోకముందే జగన్ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -