Wednesday, May 8, 2024
- Advertisement -

కేసీఆర్ దొంగాట ఆపితే బాగుంటుంది

- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప‌క్క‌నున్న త‌న సోద‌ర తెలుగు రాష్ట్రానికి అండ‌గా నిల‌బ‌డ‌తారా.. లేక మ‌ళ్లీ మోడీ ప్రాప‌కం కోసం వెంప‌ర్లాడుతూ పార్ల‌మెంట్‌లో దొంగాట ఆడ‌తారా.. అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్ర‌త్యామ్నాయ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేద్దామంటూ గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో కేసీఆర్ దేశంలోని బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల అధినేత‌లంద‌రినీ క‌లిశారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ స‌హా త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి హ‌డావుడి చేశారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు, వై.ఎస్‌.జ‌గ‌న్ పార్ల‌మెంట్‌లో మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. దానికి దేశంలోని కాంగ్రెస్‌తో స‌హా అన్ని పార్టీలు మ‌ద్ద‌తిచ్చాయి.

ఒక్క కేసీఆర్‌కు చెందిన తెరాస, త‌మిళ‌నాడు అన్నాడీఎంకేలు త‌ప్ప.. మిగ‌తా వారంతా మ‌ద్ద‌తిచ్చారు. అస‌లు అవిశ్వాసంపై చ‌ర్చే జ‌ర‌గ‌కుండా తెరాస‌, అన్నాడీఎంకే ఎంపీలు పార్ల‌మెంట్‌లో గ‌లాటా చేసి వాయిదా ప‌డేలా నెల‌కు పైగా వ్య‌వ‌హ‌రించారు. అదేంటి.. మీరు బీజేపీ ప్ర‌త్యామ్నాయ‌మంటూ తిరుగుతూ.. మీ తెలంగాణ రాష్ర్ట స‌మితి ఎంపీలు పార్ల‌మెంట్‌లో అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా గ‌లాటా చేస్తున్నారు, డ‌బ‌ల్ గేమ్ ఆడుతున్నారా.. అంటూ మ‌మ‌తా దీదీ లాంటి వాళ్లు కేసీఆర్‌ను నేరుగానే క‌డిగేశారంటూ అప్ప‌ట్లో జాతీయస్థాయిలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. దీంతో అంద‌రికీ కేసీఆర్‌, మోడీ మ‌ధ్య‌నున్న ర‌హ‌స్య అజెండా గురించి తెలిసిపోయింది. ఒక‌వైపు మోడీని వ్య‌తిరేకిస్తూనే.. మ‌రోవైపు త‌న‌కు చేత‌నైన సాయం చేసేలా పార్ల‌మెంట్‌లో అస‌లు అవిశ్వాసం చ‌ర్చ జ‌ర‌గ‌కుండా కేసీఆర్ అడ్డుకోవ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లొచ్చాయి.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వ్వ‌నున్నందు.. మ‌ళ్లీ మ‌రోసారి అవిశ్వాసం పెట్టేందుకు ఏపీ సీఎం ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌య్యారు. గ‌తంలోలా కాకుండా ఈసారి ముంద‌స్తుగానే.. దేశంలోని బీజేపీ యేత‌ర పార్టీల‌న్నింటికీ చంద్ర‌బాబు లేఖ‌లు రాశారు. వాటిని స్వ‌యంగా తెలుగుదేశం ఎంపీలు తీసుకుని వెళ్లి ఆయా పార్టీల‌కు అంద‌జేశారు. సీపీఎం, సీపీఐ స‌హా అన్ని పార్టీల‌కూ చంద్ర‌బాబు ఎనిమిది పేజీల లేఖ‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి రాశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలపై రూపొందించిన బుక్‌లెట్‌‌ను అందజేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఎంపీల ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని, కేంద్రం తీర‌ని ద్రోహం చేసిందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటివాళ్లు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా గ‌త రెండు మూడు రోజులుగా గ‌ళమెత్తారు.

కానీ.. అంద‌రికీ మ‌ళ్లీ కేసీఆర్ పైనే సందేహంగా ఉంది. ఈసారైనా అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తారా.. లేక మ‌ళ్లీ దొంగాట ఆడేస్తారా.. అనేది ప్రశ్నార్థ‌కంగా మారింది. కేసీఆర్ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు.. కానీ.. పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌ర‌గ‌కుండా త‌న ఎంపీల‌తో ఏదో ఒక అంశం గురించి రాద్ధాంతం చేయ‌కుండా ఉంటే చాలు. అవిశ్వాసంలో చంద్ర‌బాబు స‌ఫ‌లీకృతం కాక‌పోయినా ప‌ర్వాలేదు. క‌నీసం అవిశ్వాసం జ‌రిగిందంటే రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. కేంద్రం స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కావాల‌ని మోడీ కేసీఆర్‌ను ప్ర‌యోగించి.. అవిశ్వాసంపై చ‌ర్చే జ‌ర‌గ‌కుండా గ‌త‌సారి దొంగాట ఆడార‌నే విష‌యం అంద‌రికీ అర్థ‌మైపోయింది. చూద్దాం.. ఈసారైనా కేసీఆర్ నిల‌క‌డ‌గా ఉండి.. బీజేపీ యేత‌ర మూడో ఫ్రంట్ అనే మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటారేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -