Tuesday, May 7, 2024
- Advertisement -

ఆలస్యంతో కాంగ్రెస్‌కు లాభమా, నష్టామా!

- Advertisement -

కేసీఆర్‌ పాలనను అంతం చేస్తాం… కారు పార్టీకి సరైన ప్రత్యామ్నాయం మేమే… కేసీఆర్‌ను గద్దె దించుతాం… గడీల పాలన అంతమొందిస్తాం… పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుంది… రాష్ట్ర రాజకీయాలను ఢిల్లీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు… ఇవీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తరచుగా చెప్పే మాటలు, టీ కాంగ్రెస్‌కు కొత్త సారథి వచ్చే వేళ పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు. అయితే, ఒకవైపు వైఫల్యాలు ఎదురవుతున్నా, మరోవైపు చాపకింద నీరులా బీజేపీ తమ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ కళ్లు తెరుచుకోలేదనేది వాస్తవం. అందువల్లనే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి నిన్నా మొన్నా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీల కన్నా అధ్వానంగా తయారైంది.

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ ఆక్రమించింది. బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాషాయ పార్టీలో నూతనోత్తేజం వెల్లివెరిసింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల్లో పార్టీకి విజయాలను అందిస్తున్న నేతగా పేరున్న హరీశ్‌ రాజకీయ చాణక్యాన్ని తట్టుకుని దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే జోష్‌తో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 4 డివిజన్లే దక్కించుకున్న బీజేపీ.. ఏకంగా 48 డివిజన్లలో జయకేతనం ఎగురవేసి.. టీఆర్‌ఎస్‌ సొంతంగా మేయర్‌ పీఠాన్ని చేపట్టకుండా అడ్డుగా నిలిచింది.

ఇక టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పరాజయాల పరంపర కొనసాగింది. అంది వచ్చిన అవకాశాలను వదులుకున్న కాంగ్రెస్‌.. ఆలస్యంగా మేలుకొంది. కారు పార్టీ తర్వాతి స్థానాన్ని కాషాయ పార్టీ తన్నుకుపోయాక పార్టీ నాయకత్వ మార్పుపై దృష్టి పెట్టింది. ఇక సీనియర్‌ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరో ఎంపీ రేవంత్‌ రెడ్డి మధ్య టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ప్రధానంగా పోటీ ఉంది. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించని పక్షంలో బీజేపీలోకి వెళ్తామని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓవైపు, రేవంత్‌రెడ్డి మరోవైపు పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. మరి నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆలస్యం అమృతం అవనుందా! లేక ఉన్న ఈ కాస్త కేడర్‌ను కమలం, కారు గూటికి చేర్చే విషంగా మారనుందా చూడాలి!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -