Monday, April 29, 2024
- Advertisement -

నివురుగప్పిన నిప్పులా వైఎస్ఆర్ సీపీ

- Advertisement -

విజయనగరం అసెంబ్లీ టికెట్ కోలగట్లకేనని జగన్ పరోక్షంగా చేసిన ప్రకటన జిల్లా వైఎస్ఆర్ సీపీలో విభేదాలు సృష్టిస్తోంది. పార్టీ ప్రారంభం నుంచీ నమ్ముకుని ఉన్న తమకు అన్యాయం చేస్తారా ? అని అవనాపు బ్రదర్స్ నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ పురుడు పోసుకున్నప్పుడు తమ తండ్రి దివంగత అవనాపు సూరిబాబు ఆ పార్టీ జెండాను విజయనగరంలో పట్టుకున్న తొలి వ్యక్తి అని ఆయన తనయులు అవనాపు విక్రమ్, విజయ్ గుర్తు చేస్తున్నారు. నాటి కాంగ్రెస్ నేతలు బొత్స సహా పలువురి నుంచి అనేక బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గక నిలబడ్డామని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలు ఏవి జరిగినా తామే ముందుడి ఆర్ధికసాయం చేశామని చెబుతున్నారు. అటువంటి తమకు టికెట్ నిరాకరించినట్టేనా ? ఓ క్లారిటీ ఇస్తే మా దారి మేం చూసుకుంటామని పార్టీ పెద్దల వద్ద అవనాపు బ్రదర్స్ వాపోతున్నారు. విజయనగరం పాదయాత్రలో జగన్ తనతో పాటు కోలగట్ల వీరభద్రస్వామిని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. దీంతో అతడి వర్గీయులు మిఠాయిలు, బాణాసంచా కాలుస్తూ పండగ చేసుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యే టికెట్ కోలగట్లకేనని సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే కోలగట్ల ఎమ్మెల్సీగా ఉన్నందున తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చాలా రోజులుగా అవనాపు బ్రదర్స్ ఆశిస్తున్నారు. పెన్మత్స సాంబశివరాజుతో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులతోనూ అదే విషయం చర్చిస్తూ వచ్చారు. టికెట్ కన్ ఫాం అయితే ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా దూసుకుపోతామని చెప్పుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ పార్టీ మనుగడ కోసం పాటుపడుతున్నామని, తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మరింత దూకుడుగా వెళ్తామని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరిన బొత్సతో కూడా పాత తగాదాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తూ వస్తున్నారు. అయితే పాదయాత్ర సందర్భంగా జగన్ చేసిన ప్రకటనపై వీరిలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. పెన్మత్స, బొత్స ఇలా పార్టీ తరఫున ఏ సీనియర్ నాయకుడు పని చేస్తున్నా..వారి అనుభవానికి, పెద్దరికానికి గౌరవిస్తూ వారి అడుగుల్లో అడుగులేశారు. ఇప్పుడు జగన్ వచ్చి తమ ఆశలపై నీళ్లు చల్లేసరికి అవనాపు బ్రదర్స్ భవిష్యత్ పై ఆందోళన మొదలైంది. పార్టీ నేతలను అదే విషయం నిలదీస్తుండటంతో పార్టీ పెద్దలు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు త్వరలో విజయనగరం నగరపాలక సంస్థగా మారుతుందని, అప్పుడు పార్టీ తరఫున మేయర్ అభ్యర్ధులు మీరేనంటూ అవనాపు బ్రదర్స్ కి బుజ్జగించుతున్నారు. కానీ ఆ హామీలను నమ్మేదెలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు తమను ఆర్ధికంగా వాడుకుని, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చినట్లే రేపు కూడా హ్యాండిస్తారేమో ? అని అనుమానిస్తున్నారు. మరోవైపు టీడీపీ వైపు చూస్తున్నారు. అటువైపు మారితే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో అవనాపు బ్రదర్స్ పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -