Sunday, April 28, 2024
- Advertisement -

సీఎం గారూ.. మీకిది తగునా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన షాక్ తో… ఏపీ ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం… జూన్ 2 నాటికి ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేయాలంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో.. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి మూటాముల్లె సర్దుకొని పోవాలంటే ఎలా అని కొందరు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది.

పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండొచ్చు.. ఆ లోపు పిల్లల భవిష్యత్ తీర్చిదిద్ది.. విజయవాడకు వెళ్లిపోవచ్చు అనుకుంటే.. అప్పుడే ఇవేం ఆదేశాలన్న చర్చ ఆంధ్రా ఉద్యోగుల్లో మొదలైనట్టు కనిపిస్తోంది.

ఉన్నఫళంగా హైదరాబాద్ విడిచి వెళ్లాలంటే.. విజయవాడ వాతావరణానికి అలవాటు పడేందుకు టైం సరిపోదు. దీనికి తోడు.. ఆస్తులన్నీ విడిచిపెట్టి బెజవాడలో బతుకుదామంటే అప్పటికప్పుడు వసతులు సమకూర్చుకోవడానికి అవకాశం లేదు. జూన్ 2 లోగా.. అంటే ఈ 7 నెలల్లోపు ఎంతో కొంత సర్దుకుపోదామని కొందరు అనుకున్నా.. పిల్లల చదువులను మధ్యలో ఆపేయడం అసలే కుదరదు. చదువుల విషయంలో ఎలాంటి ప్రయోగాల చేసినా.. ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలపై.. బాబు సర్కార్ తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఏపీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఏపీకి ఉద్యోగుల అవసరం ఎంతో ఉందని.. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులతో పాటు.. ప్రభుత్వం కూడా విజయవాడ నుంచే పని చేస్తుందన్న విషయం గమనించాలని కోరుతున్నారు. అయితే.. మరికొందరు గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబుకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. వరుసగా పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబు.. అధికారం కోల్పోవడంలో అప్పటి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం కూడా ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలుగుదేశం నేతలు.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాబుకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -