Friday, May 10, 2024
- Advertisement -

స‌ఫారీల‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ…

- Advertisement -

దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ పర్యటనని భారత్ జట్టు విజయంతో ముగించింది. శనివారం అర్ధరాత్రి ముగిసిన విజేత నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగులు తేడాతో గెలుపొందిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది.

ఓపెనర్ శిఖర్ ధావన్ (47: 40 బంతుల్లో 3×4), సురేశ్ రైనా (43: 27 బంతుల్లో 5×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా 165/5కే పరిమితమైంది. ఆ జట్టులో కెప్టెన్ జేపీ డుమిని (55: 41 బంతుల్లో 2×3, 3×6) అర్ధశతకం బాదినా సఫారీలను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

వరుసగా మూడో టీ20లోనూ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని భారత్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సఫారీ గడ్డపై వైఫల్యాలతో ఢీలాపడిన రోహిత్ శర్మ (11: 8 బంతుల్లో 2×4) ఆదిలోనే రెండు బౌండరీలు బాది ఊపుమీద కనిపించినా.. మరోసారి జూనియర్ డాలా బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఒక ఎండ్‌లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్నా.. రైనా వరుసగా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న రైనా.. స్పిన్నర్ షంసీ బౌలింగ్‌లో ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (13: 10 బంతుల్లో 1×6) దూకుడుగా ఆడే క్రమంలో ఔటైపోయాడు. కొద్దిసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి శిఖర్ ధావన్ కూడా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో భారత్ ఒత్తిడిలో పడినట్లు కనిపించింది.

ఈ దశలో మహేంద్రసింగ్ ధోని (12: 11 బంతుల్లో 1×4), దినేశ్ కార్తీక్ (13: 6 బంతుల్లో 3×4)తో కలిసి హార్దిక్ పాండ్య (21 : 17 బంతుల్లో 1×6) కాసేపు స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే.. చివర్లో భారత్ వరుసగా ప్రధాన వికెట్లు చేజార్చుకోవడంతో 172 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జూనియర్ డాలా మూడు, క్రిస్ మోరీస్ రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్యఛేదనలో ఓపెనర్ హెండ్రిక్స్ (7)ని ఆదిలోనే ఔట్ చేసి సఫారీలకి భువనేశ్వర్ షాకివ్వగా.. అనంతరం వచ్చిన జేపీ డుమినితో కలిసి డేవిడ్ మిల్లర్ (24: 23 బంతుల్లో 2×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సురేశ్ రైనా బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదిన మిల్లర్.. అతని బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులో వచ్చిన స్టార్ హిట్టర్ క్లాసెన్ (7) హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయి భువీ చేతికి చిక్కడంతో దక్షిణాఫ్రికా 79/3తో ఇబ్బంది పడింది. ఈదశలో క్రిస్టియాన్ (49: 24 బంతుల్లో 5×4, 2×6) బ్యాట్ ఝళిపిస్తూ కెప్టెన్ డుమినికి సాయం అందించాడు. అయితే.. చివర్లో పరుగులు, బంతులు మధ్య వ్యత్యాసం క్రమంగా పెరిగిపోవడంతో.. హిట్టింగ్‌కి ప్రయత్నిస్తూ దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. బెహార్డీన్ (15నాటౌట్: 6 బంతుల్లో 3×4) మెరిసినా ఫలితం లేకపోయింది.
చివరి ఓవర్‌లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -