Saturday, April 27, 2024
- Advertisement -

ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌… ముంబ‌య్ చెన్నైమ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌పోరు

- Advertisement -

ఐపీఎల్ లీగ్ ద‌శ ముగిసింది. ఇక ప్లేఆఫ్ రేస్ ప్రారంభం కానుంది.మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. రెండు జ‌ట్ల మ‌ధ్య హోరా హోరి పోరు న‌డుస్తుంద‌న‌డంలో సందేహంలేదు. ఇప్పటి వరకూ ఒక్క టైటిల్ కూడా గెలవని ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఈ ఏడాది ప్లేఆఫ్‌కి చేరి టైటిల్ రేసులో నిలిచింది. ప్లేఆఫ్‌లో భాగంగా మంగళవారం క్వాలిఫయర్-1, బుధవారం ఎలిమినేటర్, శుక్రవారం క్వాలిఫయర్ -2, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెపాక్ వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు వెల్తుంది. ఓడిన టీమ్‌కు మ‌రో చాన్స్ ఉంటుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడనుంది. టాప్-2లో నిలిచిన జట్లకి ఫైనల్‌‌కు చేరేందుకు మరో అవకాశం ఇవ్వడం ఐపీఎల్‌లో ఆనవాయితీగా వస్తోంది.

పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు విశాఖపట్నం వేదికగా బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢీకొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. క్వాలిఫయర్ -2లో ఆడనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. క్వాలిఫయర్ -1‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి చేరనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది

ముంబై ఇండియన్స్ లోని కీల‌క ఆట‌గాళ్లు :

రోహిత్‌ శర్మ: ఈ సీజన్‌లో 386 పరుగులు చేశాడు. ఒత్తిడిని తట్టుకుంటూ కీలక మ్యాచ్‌ల్లో రాణిస్తున్నాడు.

డికాక్‌: ఐపీఎల్‌–12 అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో (492 పరుగులు) ఉన్నాడు. దూకుడుగా ఆడే డికాక్‌ మంచి ఆరంభాలనిస్తున్నాడు.

హార్దిక్‌ పాండ్యా: 380 పరుగులు, 14 వికెట్లతో ఆల్‌రౌండర్‌ హోదాకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. లక్ష్యం ఎంత భారీగా ఉన్నా వెరవకుండా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. బౌలింగ్‌లోనూ ఆత్మ విశ్వాసంతో బంతులేస్తున్నాడు.

బుమ్రా, మలింగ: ఈ సీజన్‌లో 17 వికెట్లతో బుమ్రా, 15 వికెట్లతో మలింగ ముంబైకి వెన్నుముకగా నిలిచారు. ఈ పేస్‌ ద్వయం చివరి ఓవర్లలో మరింత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్ లో కీల‌క ఆట‌గాళ్లు :

ధోని: 12 మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాల సాయంతో 368 పరుగులు చేశాడు. ఆఖర్లో భీకర హిట్టింగ్‌కు దిగే పాత ధోనిని చూసే అవకాశం… చాలా కాలం తర్వాత ఈ సీజన్‌లో ప్రేక్షకులకు దక్కింది. పరిమిత వనరులనే అవసరానికి తగినట్లుగా వాడుకుంటూ జట్టును ప్లే ఆఫ్స్‌ చేర్చాడు.

డుప్లెసిస్‌: ఓపెనర్‌గా వస్తూ మంచి స్కోర్లు చేస్తున్నాడు. ఆదివారం పంజాబ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ డుప్లెసిస్‌ ఫామ్‌ను చాటుతోంది.

రైనా: జట్టు మొత్తంలో కీలక బ్యాట్స్‌మన్‌. వన్‌ డౌన్‌లో దిగుతూ స్కోరు చేసే బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నాడు.

బ్రేవో: బ్యాట్, బంతితో ఈ సీజన్‌లో స్థాయికి ఊహించిన మేర మెరుపులు కనబర్చలేదు. అయినా, విధ్వంసక బ్యాటింగ్, జిత్తులమారి బౌలింగ్‌ కారణంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

తాహిర్‌: ప్రస్తుత లీగ్‌లో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రబడ (25)ను అందుకునే అవకాశం ఉంది. తాహిర్‌ స్పిన్‌ మాయకు ప్రత్యర్థుల దగ్గర జవాబే ఉండటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -