కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడైన టీచర్‌కు మొత్తం 161 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹87,000 జరిమానా విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన 2019 జూలైలో తిరువనంతపురంలోని ఒక ప్రత్యేక పాఠశాలలో చోటుచేసుకుంది. ఆటిజంతో బాధపడుతున్న బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆ పాఠశాలలో చేర్పించారు. అయితే కొద్ది రోజులకే బాలుడి ప్రవర్తనలో తీవ్ర మార్పులు కనిపించాయి. అతడు భయంతో ఉండటం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం, శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.
బాలుడు మాటల ద్వారా తన బాధను వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉండటంతో, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా గమనించారు. చివరకు బాలుడు రాయడం, చిత్రాల రూపంలో తనపై జరిగిన దారుణాన్ని వివరించాడు. పాఠశాలలో పనిచేసే సంతోష్ కుమార్ (56) అనే టీచర్ తనను లైంగికంగా వేధించాడని సంకేతాల ద్వారా తెలియజేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఈ కఠిన శిక్షను విధించింది.
