Tuesday, May 7, 2024
- Advertisement -

కాంగ్రెస్ గూటికి జగనన్న బాణం..ఆయనే టార్గెట్?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది వైఎస్ షర్మిల. త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పాటు ఇడుపులపాయ సాక్షిగా అన్న జగన్‌తో ఉన్న విభేదాలను ఒప్పుకోకనే ఒప్పుకుంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా షర్మిల, జగన్‌ వేర్వేరుగా నివాళి అర్పించడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది కూడ ఇలాంటి సంఘటనే జరిగినా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చేది ఎన్నికల నామ సంవత్సరం…రాజకీయంగా టార్గెట్ అవుతారు అని తెలిసినా తగ్గేదేలే అంటూ ఇద్దరు వేర్వేరుగా నివాళి అర్పించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.

వాస్తవానికి జగన్‌కు షర్మిలకు మధ్య గ్యాప్ వచ్చి చాలాకాలమే అయింది. అయితే షర్మిల మాత్రం అన్నతో వైరం కంటే తనదారి తాను చూసుకుంటే మంచిదని తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ కాక ముందు ఏపీలో వైసీపీని నిలబెట్టింది షర్మిల. జగన్ యాత్ర మధ్యలో అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లగా పార్టీని అంతా తానై నడిపించారు. జగనన్న వదిలిన బాణాన్ని…నేను ఉన్నాను అంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగింది. బైబై బాబు అంటూ షర్మిల అందుకున్న నినాదం జనాల్లోకి వెళ్లి వైసీపీ బలోపేతం కావడానికి తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దోహద పడింది. అయితే ఈ క్రమంలో జైలు నుండి బయటకు వచ్చిన జగన్‌…షర్మిలను దూరం పెడుతూ వచ్చారు. కనీసం షర్మిలకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.

తర్వాత సీన్ కట్ చేస్తే ఏపీ రాజకీయాలకు దూరమైన షర్మిల…తెలంగాణలో అడుగుపెట్టింది. తర్వాత పాదయాత్ర,నిరాహార దీక్షలతో హడావిడి చేసినా స్పందన అంతంత మాత్రమే వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం తన పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేసేందుకు సిద్ధమైంది. సోనియాతో భేటీ తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక వై ఎస్ ఆర్ ఆత్మబంధువు కే వి పి రామచందర్రావు చక్రం తిప్పారు.

ఇక త్వరలోనే తన పార్టీ విలీనంపై షర్మిల స్పష్టమైన ప్రకటన చేయనుండగా తెలుగు రాష్ట్రాల్లో షర్మిలను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. కర్ణాటక నుండి రాజ్యసభ పదవి ఆఫర్‌తో పాటు ఏపీలో స్టార్‌ క్యాంపెయినర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే వాస్తవానికి షర్మిలకు ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. సికింద్రాబాద్‌ లేదా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. అయితే షర్మిల సేవలను తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సోనియాతో 40 నిమిషాల భేటీలో ప్రధానంగా ఇదే అంశం చర్చకు వచ్చినట్లు టాక్. అలాగే ఏపీలో పార్టీ బాధ్యతలు కూడా చేపట్టాలని అగ్ర నేతలు కోరినట్లు తెలుస్తోంది.

ఇక షర్మిల తెలంగాణ రాజకీయాల సంగతి పక్కన పెడితే ఏపీలో అడుగుపెడితే రాజకీయం రసవత్తరంగా మారడం కాయం. అన్న జగన్‌పై షర్మిల విమర్శలు చేయడమే కాదు జగన్ పాలనలో అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది. ఇది వైఎస్‌ ఫ్యామిలీకి ఇబ్బందే. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో ఆ కుటుంబ పరువు పోయింది. సొంత బాబాయినే జగన్ బంధులు చంపించారని క్షేత్ర స్ధాయిలో ప్రజల్లో బలంగా ఉంది. దీనికి తోడు తోబుట్టువుతో వైరం జగన్‌కు కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇది టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకున్న సందేహ పడాల్సిన అవసరం లేదు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.జగన్ వదిలిన బాణం…ఆయనకే తగిలేలా ఉందని ఇది రాజకీయంగానే కాదు కుటుంబ పరంగా జగన్‌కు ఇబ్బందులు తప్పవని విశ్లేషకుల వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -