Wednesday, May 8, 2024
- Advertisement -

అడ్డంకులు అధిగమించి అభివృద్ధి పథంలో నవ్యాంధ్ర

- Advertisement -

‘జ‌న్మ‌భూమి’ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో స‌భాప‌తి…అమెరికాలోని చికాగోలో ప్ర‌వాసాంధ్రుల‌తో భేటీ…బాలారిస్టాల‌ను అధిక‌మిస్తే భ‌విష్య‌త్తు మ‌న‌దే…

కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరమైన ధోరణిలో రాష్ట్రాన్ని  నిర్దాక్షిణ్యంగా విడగొట్టిందని దానికి ఫలితం ఆ పార్టీ అనుభవించిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.

పార్లమెంటులో ఆంధ్రా ఎంపీలను కొట్టి, లైట్లు ఆర్పి అర్ధరాత్రి  కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభ‌జించింద‌ని,  ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం కూడా నవ్యాంధ్రకు చేయూతనివ్వడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడం లేదని ఇది చాలా దురదృష్టకరమని ప్రత్యేక హోదా ఇస్తేనే నవ్యాంధ్రకు న్యాయం జరుగుతుందని డాక్టర్ కోడెల వెల్లడించారు. గ‌త ఇర‌వై రోజులుగా అమెరికాలోని వివిధ ప‌ట్ట‌ణాల‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌వాసాంధ్రులు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేలా ప్రోత్స‌హిస్తున్న డాక్ట‌ర్ కోడెల చికాగోలో ప‌ర్య‌టించారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం ఉద‌యం అక్క‌డి స‌మావేశంలో పాల్లొన్న ఆయ‌న ప్ర‌వాసుల‌ను ఉత్తేజ‌ప‌రుస్తూ వాస్త‌వ ప‌రిస్ధితులను వివ‌రించారు.

 నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు లేకున్నా ఆ రాష్ట్రాన్ని అన్ని పరిస్థితుల్లో ముందుకు నడిపించగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న చంద్ర‌బాబు నాయకత్వం  ఏపికి ఉందని శివప్రసాద్ గుర్తు చేసారు. చంద్రబాబు తన స్వార్థం కోసం వ్యవహరించడం లేదని ఆయన రాజధానిని కుప్పంలో పెట్టుకోలేదని, అన్ని విధాలా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం ఆయన పరిపాలనాదక్షతకు నిదర్శనమని కోడెల అన్నారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత స్వర్గీయ ఎన్.టీ.రామారావుకు దక్కుతుందని,ఆయన బాటలో నడుస్తున్న చంద్రబాబు తెలుగువారికి మరింత గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం చేపట్టిన చర్యల మూలంగా ఐటీ రంగం హైదరాబాద్‌లో ప్రపంచస్థాయిలో ప్రముఖ స్థానం పొందిందని చాలా మంది యువతీయువకులు విదేశాలకు వెళ్లి  మంచి రంగాల్లో స్థిరపడ్డారన్నారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు నవ్యాంధ్ర నవ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, తమకు జన్మనిచ్చిన గ్రామాల అభివృద్దికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలబడే సత్తా తెలుగువారికి ఉంద‌ని నిరూపించుకోవ‌ల‌సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని స్ప‌ష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అపారమైన సహజసంపద నవ్యాంధ్రలో ఉందని ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని స్పీకర్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు సులభంగా లభిస్తున్నాయని తెలిపారు. ఏపీకి ఉన్న విశాల‌మైన కోస్తా తీరం ,వ‌న‌రులు వ్యాపార వాణిజ్య రంగాల‌కు బ‌ల‌మైన పునాదులుగా ఉన్నాయ‌న్నారు.  ప్రస్తుతం దేశంలో పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైన రాష్ట్రాల జాబితాలో ఎపికి రెండ‌వ స్ధానం ద‌క్కింద‌ని, ఇది స్వ‌యంగా ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్ అని కోడెల గుర్తు చేసారు. రానున్న 15 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఎపి ప్ర‌తిష్టాత్మ‌క రాష్ట్రంగా రూపు దిద్దుకోనుంద‌ని,  బాలారిష్టాలను అధిక‌మించేందుకు ప్ర‌వాసాంధ్రుల స‌హ‌కారం అత్యావ‌శ్య‌క‌మ‌ని డాక్ట‌ర్ కోడెల స్ప‌ష్టం చేసారు.  కార్య‌క్ర‌మంలో అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తినిధి కోమ‌టి జ‌య‌రాం మాట్లాడుతూ న‌వ్యాంధ్ర అభివృద్దికి స‌హ‌క‌రించేందుకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామ‌ని, త‌ద‌నుగుణంగా ముంద‌డుగు వేస్తున్నామ‌ని వివ‌రించారు.

చ‌ట్ట‌స‌భ‌లు ప్ర‌జాబీష్టాన్ని ప్ర‌తిబింబించాలి

చ‌ట్ట‌స‌భ‌లు ప్ర‌జాభీష్టాన్ని ప్ర‌తిబింబించేలా ప‌నిచేయాల‌ని, స‌భ్యులు అయా దేశాల రాజ్యాంగ ప‌రిధుల‌ను గుర్తెరిగి వ్య‌వ‌హ‌రించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావు అన్నారు. దీన జ‌నుల‌కు అవ‌స‌ర‌మైన సంక్షేమం మొద‌లు,అభివృధ్ది వ‌ర‌కు శాస‌న‌స‌భ్యులు చేసే చ‌ట్టాలు కీల‌కం కానున్నాయ‌ని, ఈ క్ర‌మంలో వారి పాత్ర ఎంతో కీల‌క‌మైంద‌ని స్ప‌ష్టం చేసారు. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచ‌ర్స్‌ ( ది ఫోర‌మ్ ఫ‌ర్ ఆమెరికాస్ ఐడియాస్‌)  నేతృత్వంలో  అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో నిర్వ‌హిస్తున్న అంత‌ర్జాతీయ శాస‌న‌స‌భ్యుల స‌ద‌స్సుకు స‌భాప‌తి హాజ‌ర‌య్యారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం స‌ద‌స్సులో స‌భాప‌తి ప్ర‌సంగిస్తూ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌తో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్ధ అత్యంత జ‌వాబుదారిత‌నంతో కూడికుని ఉండ‌గా,స‌భ్యులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించినప్పుడే అది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. త‌మ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌తిబింబించేలా స‌భ్యులు చ‌ర్చ‌ల‌లో పాల్గోని పాల‌క ప‌క్షాల నుండి త‌గిన స‌మాధానం రాబ‌ట్ట‌టంలో స‌ఫ‌లీకృతులు కావ‌ల‌సి ఉంటుంద‌న్నారు. నియ‌మావ‌ళిలో స్వ‌ల్ప మార్పులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌పంచంలోని అన్ని పార్ల‌మెంట్‌ల ప‌నితీరు ప్ర‌జ‌ల మ‌నోబీష్టాల‌కు అనుగుణంగానే ప‌నిచేయ‌వ‌ల‌సి ఉంటుంద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -