Thursday, May 2, 2024
- Advertisement -

అవిశ్వాసంలో గెలుస్తారు ఆంధ్రుల మనసుల్ని గెలవలేరు

- Advertisement -

మాకేం భయం లేదు. పూర్తి మెజార్టీ ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వెనుకాడం. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా మేం చర్చ చేపట్టడానికి భయపడలేదు. పారిపోలేదు. సభ ఆర్డరులో లేదు కనుకే అప్పుడు చర్చ చేపట్టలేకపోయాం. ఇప్పుడు సభ ఆర్డరులో ఉంటుంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు నాడు చేసినట్లు నేడు అల్లరి చేయరు. కనుక అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపడతాం. పూర్తి మెజార్టీ ఉండగా పారిపోవాల్సిన అవసరం, భయం మాకు లేవు. మెజార్టీ నిరూపించుకుంటాం. ఇదీ ఏపీ బీజేపీ నేతలతో పాటు జాతీయ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్న కబుర్లు.

అవును. బీజేపీకి మెజార్టీ లేదని ఎవరన్నారు ? మొత్తం 545 లోక్‌సభ స్థానాలకుగాను, ప్రస్తుతం స్పీకర్‌ సుమిత్రా మహాజన్ తో కలిసి 536 మంది ఎంపీలు ఉన్నారు. 9 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ సభ్యులే 273 మంది ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీల సంఖ్యతో కలిపితే అది 347కు చేరుతుంది. అయితే భాగస్వాములు అందరూ ఓటు వేస్తే 347. లేదంటే కొన్నిఓట్లు తగ్గవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి స్థితి కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చే చాన్సే వుంది. ఇక అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్న యూపీఏ కూటమిలోని కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు, టీడీపీ సహా వీరి సంఖ్యాబలం 150. బిజూ జనతాదల్ కు చెందిన 20 మంది, టీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ ఎంపీలు ముగ్గురు ఉన్నారు. ఈ 34 మందీ తటస్థంగా ఉన్నారు. వారి వైఖరి చెప్పలేదు. ఒక వేళ ఈ 34మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపితే, మొత్తం 184 ఓట్లు మోడీకి వ్యతిరేకంగా పడతాయి. ఏ రకంగా చూసినా అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. సర్కార్ కూలిపోయే పరిస్థితి అసాధ్యం.

కనుక అవిశ్వాస తీర్మానంలో బలం నిరూపించుకున్నాం. మేమే గెలిచాం. అని శుక్రవారం అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ తర్వాత బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అలా చెప్పుకునే ముందు తాము నిజంగా తాము ఆరు కోట్ల ఆంధ్రుల మనసులు గెలిచామా ? అన్నది ప్రశ్నించుకోగలరా ? అలాంటి ఆలోచనైనా వారికి కలుగుతుందా ? కాంగ్రెస్ అన్యాయం చేసింది. మేం న్యాయం చేసేస్తాం. ప్రత్యేకహోదా ఇస్తాం. అన్నివిధాలుగా ఆదుకుంటాం. అని మోడీ ఇచ్చిన హామీల అమలులో వారి చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా ? ప్రత్యేకహోదాపై తాము చేసిన మోసాన్ని అంగీకరించి క్షమాపణ కోరగలరా ? అంత ధైర్యం ఉందా ? సో అవిశ్వాసంలో టెక్నికల్ గా సంఖ్యాబలంతో గెలవవచ్చు. కానీ ఇచ్చిన మాట తప్పి, ప్రత్యేకహోదా హామీ నెరవేర్చక ఆరు కోట్ల ఆంధ్రుల మనసులు మాత్రం మోడీ గెలవలేరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -