Thursday, May 2, 2024
- Advertisement -

నెల్లూరు వైసీపీలో బయటపడ్డ విభేదాలు!

- Advertisement -

నెల్లూరు వైసీపీలో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. నగరం కేంద్రంగా మంత్రి అనిల్‌కుమార్‌, ఆనం కుటుంబానికి ఎప్పటి నుంచో పొసగడం లేదు. ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అనిల్‌కుమార్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విభేదించి రాజీవ్‌ భవన్‌ పేరుతో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాన్స్‌ దొరికినప్పడల్లా ఆనం కుటుంబంపై విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనం గ్రూపు దాదాపు అనిల్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి వద్దకు చేరింది. ఇప్పుడు నెల్లూరు నగరంలో ఆనం కుటుంబం రాజకీయంగా వెనకబడిపోయింది. ఈనేపథ్యంలో బుధవారం ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుతో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పరోక్షంగా మంత్రి అనిల్‌కుమార్‌పై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి విమర్శలకు దిగడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు హీటెక్కాయి.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి ఆనం వివేకానందరెడ్డి. ప్రత్యర్థులను తన రాజకీయ చతురతతో ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి. ఇప్పుడు ఆనం కుటుంబం రాజకీయ ప్రభ కొంత మసకబారుతోంది. ఇక ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మంత్రి అనిల్‌కుమార్‌, ఆనం కుటుంబానికి మధ్య దూరం మరింత పెరుగుతోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గ అభ్యర్థిగా అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనిల్‌కుమార్‌ అవకాశం కల్పించారు. ఆనం కుటుంబం సిఫార్సుతోనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనిల్‌కు అవకాశం వచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో అనిల్‌ 90 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆనం కుటుంబం కుట్ర కారణంగానే అనిల్‌ ఓడిపోయారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. దీంతో ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా అనిల్‌కుమార్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజీవ్‌ భవన్‌ పేరుతో కార్యాలయం ఏర్పాటుచేసి పనిచేశారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే ఆనం వివేకానందరెడ్డిపై అనిల్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. ఆ విభేధాలు ఇంకా కొనసాగుతున్నాయి.

వైఎస్సార్‌ మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనం కుటుంబం టీడీపీలో చేరింది. అప్పుడు అనిల్‌కు, ఆనం కుటంబానికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆనం ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది. అయితే, అనిల్‌కుమార్‌ ఎమ్మెల్యే కావడం, ఆయనకు వైఎస్‌ జగన్‌ మంత్రి పదవి ఇవ్వడం, వివేకానందరెడ్డి మరణంతో.. ఆనం కుటుంబం వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, ఒక్కొక్కరు అనిల్‌కు దగ్గరయ్యారు. అంతేకాకుండా, ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికే పరిమితం కావడంతో ఆనం అభిమానులుగా చెప్పుకునే వ్యక్తులు నెల్లూరు నగరంలో అనిల్‌కుమార్‌, రూరల్‌ ప్రాంతంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గూటికి చేరారు. ఇవన్నీ నెల్లూరు నగరంలో ఆనం కుటుంబం పూర్వ వైభవం కోల్పోవడానికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈక్రమంలో ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంతో మరోసాని అనిల్‌కుమార్‌, ఆనం కుటుంబం మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదిలాఉండగా.. నెల్లూరును క్లీన్‌ నగరంగా మార్చే కార్యక్రమంలో భాగంగా మంత్రి అనిల్‌కుమార్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు, ఇతర పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మాత్రం మున్సిపల్‌ అధికారులు క్షణాల్లో తొలగిస్తున్నారు. ఈసమయంలో బుధవారం నెల్లూరు నగరంలో ఆనం వివేకానందరెడ్డి జయంతి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా ఏసీ సెంటర్‌, గాంధీ బొమ్మ, వీఆర్‌సీ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఆయా కార్యక్రమాలు పూర్తి కాకముందే మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారని, మంత్రి చెబితేనే వాటిని అంత త్వరగా వాటిని తీసేశారని ఆనం కుటుంబం అభిమానులు విమర్శిస్తున్నారు. పీవీ ఫ్లెక్సీలు తొలగించడం పట్ల బ్రాహ్మణ సంఘ నేతలు ధర్నాలకు కూడా దిగుతున్నారు. కేసులు, క్రికెట్‌ బుకీల ఫ్లెక్సీలు నెలలపాటు ఉంటే పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా భవిష్యత్‌ ఇచ్చిన వ్యక్తులను మరిచిపోవడం తగదని ఆనం రంగమయూర్‌రెడ్డి హితవు పలుకుతున్నారు. మరోవైపు అనిల్‌, శ్రీధర్‌రెడ్డి వెంట నడిచే అభిమానులు ఆనం వివేకానందరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారంతా గతంలో మాదిరి ఆనం కుటుంబం వెంట నడుస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -