Thursday, May 2, 2024
- Advertisement -

ఆంధ్రాకు చెప్పిందేమిటి ? చేసిందేమిటి ?

- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై నాలుగు కారణాల వల్లే టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో చెప్పారు. కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోవడం మొదటి కారణమైతే, కేంద్రంపై నమ్మకం లేకపోవడం రెండో కారణమన్నారు. ఏపీకి ప్రాధాన్యం దక్కకపోవడం మూడో కారణమైతే, ఏపీపై కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష నాలుగో కారణమని పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా గల్లా జయదేవ్ ఈ వివరణ ఇచ్చారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాడు రాజ్యసభలో ఆరు హామీలు ఏపీకి ఇచ్చారని గల్లా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారని తెలియజేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగుతల్లిని కాంగ్రెస్ నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని, తాను ప్రధాని అయితే తల్లిని, బిడ్డను ఇద్దర్నీ ఆదుకుంటానని నాడు మోడీ చెప్పుకొచ్చారని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. తిరుపతి, విజయవాడ, నెల్లూరు ఎన్నికల సభల్లోనూ మోడీ ఇదే విషయాన్ని చెప్పారని తెలియజేశారు. ఈ విషయాలను జయదేవ్ ప్రస్తావించినప్పుడు టీడీపీ ఎంపీ మురళీ మోహన్ తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్పీకర్ సహా సభ్యులందరికీ చూపించారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీనే మోడీ మరిచిపోయారని పరోక్షంగా గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు.

ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పడంపై జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 14 వ ఆర్థిక సంఘం పేరు చెప్పి, కుంటిసాకులను చూపుతూ హామీలు అమలులో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గత ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని నెరవేర్చాల్సిన బాధ్యత, అవసరం ఉన్నావా ? లేవా ? అని నిలదీశారు. పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు ఇలా మోసం చేయడం దారుణని మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వవద్దని తాము సిఫార్సు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులైన వైవీ రెడ్డి సహా ఇతర సభ్యులూ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని, కానీ నెపం వారిపై నెట్టేసి, అబద్ధపు ప్రచారంతో ఆంధ్రాకు అన్యాయం చేయడం బాధాకరమన్నారు.

విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు… బీజేపీది కూడా అని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఏపీకి రెండు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు. తలుపులు మూసి మరీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘటనను ఆయన సభలో మరోసారి మోడీ వినేటట్టుగా చెప్పారు. అంతకముందు ‘భరత్ అనే నేను’ మూవీ స్టోరీని గల్లా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బిజూ జనతా దళ్ వాకౌట్ చేసింది. సాయంత్రం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ లో పాల్గొనకుండా తటస్థంగా ఉండాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు. ఓ వైపు ఏపీకి హోదా ఇవ్వాలని చెబుతూనే, మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని హడావుడి చేస్తూనే ఇలా ద్వంద రాజీకీయాలు కేసీఆర్ చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -