Monday, May 6, 2024
- Advertisement -

కేసీఆర్ పార్టీకి 60 సీట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 60 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 119 స్థానాలున్న తెలంగాణలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 59. ఆ అంకెను కేసీఆర్ అందుకుంటారని రిపోర్ట్స్ అందించాయి. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల జాబితా ప్రకారం ఇవి ఖాయమని అంచనా వేశారు. మిగిలిన 14 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికతో పాటు, ప్రస్తుత జాబితాలోని ఓ 20 మంది వరకూ అభ్యర్ధుల మార్పులు చేర్పులు ఉండవచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి. బీ ఫామ్ చేతికి అంది, గడువు లోగా నామినేషన్ వేసినంత వరకూ టికెట్ ఖరారు కానట్టేనని, తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలతో పాటు టీఆర్ఎస్ వర్గాలు కూడా అంటున్నాయి. కేసీఆర్ నోటితో చెప్పేది ఒకటి, చేతల్లో చూపేది ఇంకొకటి అని పలు ఉదాహరణలనూ చూపిస్తున్నాయి. అందుకే బీ ఫామ్ రావటం, అవాంతరాలు లేకుండా నామినేషన్ వేయటం పూర్తయితేనే టికెట్ కన్ ఫామ్ అయినట్టని చెబుతున్నారు. అందుకే ఓ 20 స్థానాల్లో అభ్యర్ధుల మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆయా స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ 60 స్థానాల్లో గెలవడం ఖాయమని అంటున్నారు.

ఇంకా మహాకూటమిలో పొత్తులు, సీట్ల పంపకాలపై క్లారిటీ కూడా రాలేదు. ఆ ప్రక్రియ పూర్తయినా వారి మధ్య సఖ్యత ఎంత ఉంటుందనేదే ప్రధాన ప్రశ్న. వీరిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ మేజిక్ ఫిగర్ కి అటూ ఇటుగా సీట్లలో గెలిచినా అధికారం చేపట్టడం అనుమానమే. మంత్రిపదవుల రేసులో వీళ్లలో వీళ్లు తగాదా పడటం ఖాయం. అదే అదనుగా కేసీఆర్ ఇప్పటికే అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష మళ్లీ ఉండనే ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే మహాకూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్ధులతో టచ్ లో ఉండాలని ఇప్పటి నుంచే వ్యూహం రచించేశారు. కొందరితో ఇప్పటి నుంచే టచ్ లో ఉంటున్నారు. ఎన్నికల మూడ్, అవసరాలను బట్టి సహాయసహకారాలు అందించుకుదామని, ఒకరికొకరు సహకరించుకుందామని టీఆర్ఎస్ వర్గాల ద్వారా మహాకూటమిలోని పలువురు అభ్యర్ధులను దువ్వే కార్యక్రమం చేపట్టారు. అభ్యర్ధుల ఖరారు పూర్తయిన వెంటనే ఆ దువ్వుడు జోరందుకుంటుంది. ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు ఆపరేషన్ ఆకర్షతో 10 నుంచి 15 మందికి గాలమేయనున్నారు. అందుకే తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ చెబుతుండటంతో మరో పది మందికి ఆపరేషన్ ఆకర్షతో గాలమేస్తే ఇంక ఢోకా ఉండదని గులాబీ బాస్ వ్యూహం. ఆ దిశగా ఇప్పటికే పావులు కదుపుతూ, మహాకూటమిలోని అభ్యర్ధుల ఎంపిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -