Thursday, May 2, 2024
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదు

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ పై మళ్లీ విషం చిమ్మారు. తనకు రాజకీయ అవసరాలే తప్ప, ఓటేసిన ప్రజల మనోభావాలు పట్టవని నిరూపించుకున్నారు. ఆంధ్రుల ఓట్లుపైనే తనకు ప్రేమ తప్ప, వారి ఆశలపై, ఆకాంక్షలు, అభివృద్ధి తనకు పట్టదని తేల్చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాళ్లంతా తెలంగాణ వాళ్లే. వారి కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాను. ప్రతి ఆంధ్రుడి ఇంటికి కాపలా కుక్కలా కాపు కాస్తాను. ఆంధ్రావాళ్ల మీద ఈగను కూడా వాలనివ్వం. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రుల ఆస్తులను కాపడానికి మేం ప్రాణాలు ఫణంగా పెడతాం. ఇవన్నీ గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీశ్ రావు సహా టీఆర్ఎస్ నేతలంతా చెప్పుకొచ్చిన మాటలు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. మేమంతా తెలుగు వాళ్లం. రాష్ట్రాలుగా విడిపోయినా, అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం. అభివృద్ధిలో పోటీ పడతాం. మాకు ప్రత్యేక రాష్ట్రమిచ్చిన వేళ, వాళ్లకు ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. హోదా ఇవ్వాలి. ఆంధ్రా అభివృద్ది పాటుపడాలి. హోదా కోసం డిమాండ్ చేయడంలో తప్పులేదు. అది ఆంధ్రుల హక్కు. ఆంధ్రుల హక్కును కాపాడటానికి టీఆర్ఎస్ ఎంత దూరమైనా వెళ్తుంది. వారి హోదా పోరాటంలో పూర్తి మద్దతిస్తుంది. ఇవి కూడా ఆయా ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ లో ఆంధ్రుల ఓట్లు కోసం టీఆర్ఎస్ నేతలు వేసిన బిస్కెట్లు..

బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేస్తా. అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోయి జాతీయ రాజకీయాల్లో భూకంంపం సృష్టిస్తా…ఇవీ ఈ మధ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలికిన ప్రగల్భాలు. మరి ఆ భూకంప ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయో ఆయనకే తెలియాలి. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తూ, పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దానికి పలు పార్టీలు మద్దతిచ్చాయి.. బీజేపీ కూడా గతంలో పారిపోయినట్టు పారిపోకుండా చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ నిలకడలేనితనం మరోసారి బట్టబయలైంది. ఓ స్టాండ్ లేని పార్టీగా దేశవ్యాప్తంగా నవ్వులపాలైంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎటూ తేల్చకుండా తటస్తంగా ఉందామని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని నినాదాలు చేయాలని చెప్పారు. ఓటింగ్ చేపట్టినప్పుడు మాత్రం అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా, బేజీపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా మధ్యస్థంగా ఉండాలని కేసీఆర్ చేసిన సూచన ఇప్పుడు టీఆర్ఎస్ నీచరాజకీయాలను బట్టబయలు చేసింది.,

ఓ వైపు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడతామన్నారు. ప్రత్యేకహోదా వారి హక్కు ఆ హక్కు సాధన కోసం మద్దతు ఇస్తామని గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాత్రం మద్దతు ఇవ్వకుండా, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేస్తా, జాతీయ రాజకీయాల నుంచి బీజేపీని తరిమేస్తా… అని చెప్పుకొచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఆ పార్టీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న అవిశ్వాసంపై ఓటింగ్ కు దూరంగా ఉండటం ఏంటో అర్ధం కావట్లేదు. బీజేపీ రహస్య మిత్రుడిగా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. అన్న ఆరోపణలు ఈ ఘటనతో నిజమని తేలిపోయింది. అయితే ఆంధ్రుల ఓట్ల కోసం గాలమేసి, ఇప్పుడు ఇలా తటస్థవైఖరి తీసుకున్న కేసీఆర్ పార్టీపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రులు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం. గతంలో ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇకపై పూర్తి మెజార్టీ టీఆర్ఎస్ కి కల్ల. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా, టీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పడం తప్పదు. అవిశ్వాసానికి మద్దతుతో పాటు, ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ కు ఓట్లు వేసి, కేసీఆర్ ద్వంద్వ రాజకీయాలకు ఆంధ్రులు బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -