Sunday, April 28, 2024
- Advertisement -

క్లారిటీ వచ్చేసింది.. కిరణ్ కాంగ్రెస్ లో కిశోర్ టీడీపీలో

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఆయన కుటుంబానికి మంచి పట్టువుంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి దివంగత అమర్నాథ్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం నుంచే గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వాల్మీకిపురం, పీలేరు ప్రాంతం నుంచే విజయం సాధించారు. చివరకు కాంగ్రెస్ తరఫున సీఎం కూడా అవడంతో ఆ ప్రాంతంలో ఆయన పలుకుబడి మరింత పెరిగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా, గట్టిగా పోరాడలేదు. ఆయన సైతం పోటీ చేయలేదు. కానీ కిరణ్ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమి అందరూ ఊహించినదే.

ఇటీవల కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనకు టీడీపీ పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారు. దీంతో కిశోర్ టీడీపీ మీద నమ్మకంతో, భవిష్యత్ లో మరిన్ని మంచి పదవులు వస్తాయనే ఆశతో చురుగ్గా పని చేస్తున్నారు. అయితే కిరణ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన సోదరుడు కిశోర్ కూడా మళ్లీ హస్తం గూటికి వెళ్లిపోతారనే ఊహాగానాలు జోరుగా చిత్తూరు రాజకీయాల్లో వినిపించాయి. వాటికి పులుస్టాప్ పెడుతూ కిరణ్ ఏ పార్టీలో ఉన్నా కిశోర్ మాత్రం టీడీపీలోనే ఉంటారని టీడీపీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అన్న రాజకీయాలు అన్నవే. తమ్ముడి రాజకీయాలు తమ్ముడివే అని మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ, వైఎస్ఆర్ సీపీ కలిసిపోతున్నంత మాత్రాన, ఎన్డీఏ కూటమిలోకి జగన్ ను కేంద్రం మంత్రి ఆహ్వానిస్తున్నంత మాత్రాన టీడీపీ, కాంగ్రెస్ కలిసిపోతాయనుకోవడం మూర్ఖత్వమేనన్నారు. కాంగ్రెస్ చెప్పి అన్యాయం చేస్తే, బీజేపీ నమ్మించి మోసం చేసిందని అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారని ఓ క్లారిటీ ఇచ్చేశారు.

అంతవరకూ బాగానే వుంది. అన్నదమ్ముల రాజకీయాలు, పార్టీలు, భవిష్యత్ పై స్పష్టత వచ్చేసింది. కానీ మొదట నుంచీ నల్లారి వారి కుటుంబాన్నే నమ్ముకుని ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అనుచరులే ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, విశ్రాంత ఉద్యోగులు ఇప్పుడు కిరణ్ తో పాటు కిశోర్ తోనూ చర్చలు జరుపుతున్నారు. వీటితో పాటు గుర్రంకొండ, కంభంవారిపల్లె, పీలేరు, కలకడ, వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో నాయకులు, నల్లారి అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా కిరణ్ కుమార్ సైలెంట్ అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉండటంతో వీరు ఇతర పార్టీలకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ, కిశోర్ టీడీపీ ఎంట్రీతో వారి అనుచరులు గందరగోళంలో పడిపోయారు. ఎవరితో నడవాలి. ఏ పార్టీతో వెళ్లాలి. అనేది తేల్చుకోలేక సతమతమైపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -