Tuesday, May 28, 2024
- Advertisement -

కారు జోరుకు రెబల్స్ బ్రేకులు

- Advertisement -

ఇలా అసెంబ్లీ రద్దు చేస్తూనే అలా 105 మంది అభ్యర్ధుల పేర్లు టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రకటించేశారు. ఆహా ఓహో ఏం దూకుడు ? ఎంత ముందుచూపు ? ఎక్కడా చూడని రాజకీయ చాణక్యం అంటూ మీడియా ఆకాశానికెత్తేసింది. ఆ ప్రకటన నిజంగా షాకింగ్ వార్తే. మీడియా వర్గాలు, మిగిలిన రాజకీయ పార్టీలకే కాదు. టీఆర్ఎస్ లోని అధిక శాతం నాయకులకు, ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్న ద్వితీయశ్రేణి నేతలకు కోలుకోలేని దెబ్బే. కానీ కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి మెల్లగా తేరుకుంటున్న ఆశావహులు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల వైపు అడుగులేస్తున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, బలంగా ఉన్న నాయకులు, ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. వారి దూకుడు ఏ స్థాయిలో ఉందంటే ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగడానికి వెనుకాడటం లేదు. అయితే ఇక్కడ వారికి ఫస్ట్ ఆప్షన్ తెలుగుదేశం పార్టీయే కావడం విశేషం. తెలంగాణ టీడీపీలో కొందరు లీడర్లు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నా, దశాబ్దాల నుంచీ గ్రౌండ్ లెవల్లో ఉన్న క్యాడర్ చాలా వరకూ ఇంకా అలానే ఉంది. సరైన నాయకుడు తమను నడిపిస్తే, నడవడానికి సిద్ధమంటోంది. దీంతో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి, భంగపడిన నేతలు వెంటనే టీడీపీలో చేరిపోతున్నారు. క్యాడర్ లో నూతన ఉత్తేజం నింపుతూ ఎన్నికలకు సై అంటున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఖరారైనా, కాకపోయినా తాము పోటీ చేయడం తథ్యమని తేల్చి చెబుతున్నారు.

టీఆర్ఎస్ లోకి ఇప్పుడు చేరికల కంటే, ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వలసలే అధికంగా ఉంటున్నాయి. టీటీడీపీ సమావేశంలో ఇటీవలే చంద్రబాబు సమక్షంలోనే టీఆర్ఎస్ నేత బానోత్ మోహన్ లాల్ లక్ష్మీదేవి దంపతులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వీరు మబబూబాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. మోహన్ లాల్ 2014లో మహబూబాబాద్ ఎంపీ స్థానం కోసం టీడీపీ నుంచే బరిలో దిగి ఓటమి చెందారు. తర్వాత టీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్న హామీతో ఆ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు గులాబీ బాస్ హ్యాండివ్వడంతో మోహన్ లాల్ మళ్లీ కారు దిగి సైకిలెక్కేశారు.

మరో కీలక నియోజకవర్గం శేరిలింగంపల్లిలో తిరుగుబాటు మొదలైంది. 2014లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి నిరాశకు గురైన మొవ్వా సత్యనారాయణ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2019లో ఎమ్మెల్యే టికెట్ లేదా నామినేటెడ్ పోస్ట్ గ్యారెంటీగా ఇస్తామని చెప్పి మొవ్వాను నాడు గులాబీ నేతలు కారెక్కించుకున్నారు. కానీ ఆ హామీని పక్కన పెట్టేశారు. మొవ్వా సత్యనారాయణ మద్దతుతో శేరిలింగంపల్లిలో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యే గాంధీకే మళ్లీ టీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో మొవ్వా సత్యనారాయణ వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో వెంటనే శ్రేయోభిలాషులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన మొవ్వా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబును కలిశారు. టీడీపీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరిపోయారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా శేరిలింగంపల్లి నుంచి బరిలో దిగుతానని ఆయన చంద్రబాబుతో చెప్పుకున్నారు. పొత్తు ఖరారైనా ఆ టికెట్ తనకే ఇప్పించాలని కోరారు.

వీరితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇప్పుడు కారు దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. సైకిల్ ఎక్కి సత్తా చాటాలని కసితో రగిలిపోతున్నారు. ఈ వలసలు ఎన్నికల టైంకు మరింత పుంజుకోవటం ఖాయం. దీంతో ఫీనిక్స్ పక్షిలా టీడీపీ మళ్లీ తెలంగాణలో కీలకం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -