Monday, April 29, 2024
- Advertisement -

సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీ రద్దు ?

- Advertisement -

ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా ? లేదా ? అనే గందరగోళంలోకి ప్రతిపక్షాలను చివరివరకూ నెట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చివరికి ముందస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే చాలా రోజుల క్రితమే ఆయన ముందస్తుకు సిద్ధమైపోయినా, వ్యూహాత్మకంగానే ప్రతిపక్షాలకు ఆకరి వరకూ సమాచారం చేరకుండా గందరగోళం సృష్టించారు. చివరకు ఎన్నికలు డిసెంబర్ లో వచ్చినా, మార్చి, ఏప్రిల్ లో వచ్చినా సిద్ధమవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే రాజస్థాన్. మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిపితే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అక్టోబర్ లో ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ 15 లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడానికి, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు అటు ప్రధాని మోడీకి, ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే తన వర్గీయుల ద్వారా సమాచారం అందవేశారు.

అసెంబ్లీ రద్దుకు కూడా కేసీఆర్ తన సెంటిమెంట్స్ ప్రకారం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. పంచాంగం, తారాబలం, గ్రహబలం తో పాటు తనకు లక్కీ నంబర్ గా భావించే 6నే ఆయన అసెంబ్లీ రద్దుకు ముహూర్తంగా పెట్టుకున్నారు. అంటే సెప్టెంబర్ 6న ఏకాదశి నాడు తెలంగాణ అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా ఆ రోజు కుదరకపోతే సెప్టెంబర్ 7న రద్దుకు ప్రణాళిక సిద్ధమైంది. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్ కు 90 నుంచి 100 రోజుల సమయం అవసరం. అంతకు తక్కువ సమయంలో ఈసీ ఏర్పాట్లు చేసుకోవటం కష్టం. పైగా ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో
నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ లో నిర్వహించాలని ఈసీ కసరత్తు దాదాపు పూర్తి చేసేసింది. ఇక నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆలస్యం. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేసుకుంటే ఆ 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముండటంతో కేసీఆర్ ఈ లెక్కలన్నీ వేసుకునే అసెంబ్లీ రద్దుకు ముహూర్తం పెట్టేసుకున్నారు. అయితే అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే సరే…ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాక, ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ ఒత్తిడిలో ఉన్నాం. సడెన్ గా ఐదో రాష్ట్రంలో కూడా ఎన్నికల నిర్వహణ చేపట్టలేం, అని ఈసీ అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా, వచ్చే ఏడాది వరకూ నాన్చితే తమ అధినేత వ్యూహం మొత్తం దెబ్బతిన్నట్టే అని టీఆర్ఎస్ వర్గాలు మధనపడుతున్నాయి. కానీ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహణకు కూడా తాము సిద్ధమేనని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనీసం 100 రోజులకు ముందే అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు తెలంగాణ రాష్ట్రం వెళ్తే, మిగిలిన 4 రాష్ట్రాలతో పాటు ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహించడం ఈసీకి పెద్ద కష్టమేమీ కాదు.

తమ పార్టీ నుంచి నాలుగైదు స్థానాలు తప్ప మిగిలిన స్థానాలన్నింటిలో సిటింగ్ లకే టికెట్ ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. ఆ ఒక్కమాటతోనే ఆయన దాదాపు టికెట్ల ఖరారు చేసేసినట్లే. కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంకా ఆ విషయంలో ఆమడ దూరంలో ఉంది. నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. సీఎం అభ్యర్ధి రేసులో ఆ పార్టీ నుంచి ఎక్కువమంది పోటీ పడుతుండటంతో పాటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్ధుల ఖరారు ఆ పార్టీకి కత్తిమీద సాములా మారింది. ఆశావహులు ఎక్కువమంది ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో ? ఎవరిని ఎలా బుజ్జగించాలో తెలియక హస్తం పార్టీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితి. అందుకే వారికి ఏమాత్రం ఊపిరి సలపనీయకుండా కేసీఆర్ వడివడిగా ముందస్తువైపు అడుగులు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -