Saturday, April 27, 2024
- Advertisement -

మొన్న ఎన్టీఆర్ నిన్న కిరణ్ రేపు జగన్

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం అత్యంత సంక్లిష్ఠంగా మారాయి. ఉమ్మ‌డి రాష్ర్టంలో 294 సీట్లున్న‌ప్పుడు అధికారంలోనికి రావాలంటే క‌నీసం 148 సీట్లు ఉండాల్సి వ‌చ్చేది. కానీ.. గ‌త ఎన్నిక‌ల నుంచి స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. ఆంధ్ర‌లో ఉన్నవి 175 సీట్లే.. అధికారం కోసం కేవ‌లం 88 సీట్లు చాలు. అందుకే ప్ర‌స్తుతం ప్ర‌తి సీటూ కీల‌కంగానే మారిపోయింది. గ‌తాన్ని ఒక్క‌సారి చూస్తే ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఇప్ప‌టికి రెండుసార్లే రాష్ర్టంలో జ‌రిగింది. ఆ రికార్డును ప్ర‌స్తుతం జ‌గ‌న్ తిర‌గ‌రాసేలా క‌న్పిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఓ రికార్డ్ సృష్టించారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ సాధించిన ఘనతను మళ్లీ సాధించారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సృష్టించిన రికార్డును 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరగరాస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రికార్డ్ ఏంటి ? జగన్ ఎలా చరిత్ర సృష్టించ‌నున్నారో తెలుసా.?

1982 మార్చ్ 29న తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అంటే 1983లో టీడీపీ అధికారం దక్కించుకుంది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాంగ్రెసేత‌ర తొలి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ పదో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతవరకూ సినిమాల్లో ఉన్న ఎన్టీఆర్ కు అవే తొలి ఎన్నికలు. రాజకీయ అరంగేట్రంతోనే ఆయన పార్టీ సత్తా చాటింది. ఒక్కసారి కూడా మంత్రిగా చేయకుండానే, ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే అధిరోహించారు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ త‌ర్వాత ఆ ఘ‌న‌త‌ను సాధించిన వ్య‌క్తి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి. కిరణ్‌కుమార్‌రెడ్డికీ అదృష్టం కలిసొచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ఊహించని రీతిలో బాధ్యతలు చేపట్టారు. కిరణ్‌ 1989లో వాల్మీకీపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 99, 2004 ల్లో వాల్మీకిపురం నుంచి మళ్లీ ఎమ్మల్యేగా గెలిచారు. మంత్రిపదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణాల వల్ల కిరణ్‌కుమార్‌కి మంత్రిపదవి దక్కలేదు. దీంతో నిరాశ చెందిన ఆయనకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో చీఫ్‌విప్‌ పదవిని ఇచ్చారు. తర్వాత 2009లో పీలేరు నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సొంతం చేసుకున్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈ సారైనా మినిస్టర్‌ కల నెరవేర్చుకోవాలని తాపత్రయపడ్డారు. కానీ మళ్లీ ఆయనకు నిరాశే మిగిలింది. మంత్రిపదవి అందని ద్రాక్షే అయ్యింది. చట్టసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని, ప్రత్యర్ధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే నేర్పు కిరణ్‌కుమార్‌రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు వైఎస్‌. దీంతో శాసనసభ స్పీకర్‌గా కిరణ్‌కి అవకాశం కల్పించారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఏ పదవిలో ఉన్నా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకి ఏదో ఒక శాఖకు మంత్రిగా బాధ్యతలు వహించాలన్న కోరిక మాత్రం తీరలేదు. మినిస్టర్‌ కోరిక ఆయన్ని వెంటాడుతూనే ఉండేది. కానీ అనూహ్యంగా 2011లో మారిన కాంగ్రెస్ రాజకీయ పరిణామాలతో ఏకంగా ముఖ్యమంత్రి పదవే వరించింది. నాటి సీఎం కొణిజేటి రోశయ్యను తప్పించి ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఒక్కసారి కూడా మినిస్టర్‌ కాకపోయినా డైరెక్టుగా చీఫ్‌మినిస్టర్‌ అయి, ఎన్టీఆర్ మాదిరిగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా రికార్డుల కెక్కారు.

ఇప్పుడు జ‌గ‌న్ వంతొచ్చింది. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కడప ఎంపీగా తొలిసారి ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2009లో అదే పార్టీ నుంచి కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి, సొంతంగా వైఎస్ఆర్ సీపీ పెట్టుకోవడం తెలిసిందే. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా, ఏపీ శాసనసభాపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పార్టీ విజయం సాధిస్తే, జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అంటే జగన్ కూడా ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగా ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయకుండానే, ఆ అనుభవం లేకుండానే, డైరెక్ట్ గా సీఎం పోస్టు కొట్టేసినట్టే. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినట్టయితే జగన్ ఈ రికార్డు సొంతం చేసుకుంటారు. అలా జ‌రిగితే.. నాడు ఎన్టీఆర్, నిన్న కిరణ్ కుమార్, నేడు జగన్ మోహన్ రెడ్డి…ఈ ఘనత ద‌క్కించుకున్న వారిగా చ‌రిత్ర‌లో నిలిచిపోతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -