Monday, April 29, 2024
- Advertisement -

భారతీయులలో ఈ ఒక్క మార్పూ వస్తే దేశ ముఖచిత్రమే మారిపోతుంది

- Advertisement -

భారతీయులందరినీ బానిసత్వం వైపుగా నడిపిస్తున్నది ఏంటో తెలుసా? ఏడు దశాబ్ధాల స్వతంత్ర భారతదేశంలో భారతీయులు కోల్పోయిన స్వాతంత్ర్యం ఏంటో తెలుసా? ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాల్లేకుండా అధికారం మొత్తం కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వందల సంఖ్యలో భారతీయుల ప్రాణాలను బలిగొన్న అత్యంత కఠినమైన నిర్ణయాలను కూడా పాలకులు అత్యంత నిర్లక్ష్యంతో తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

భారతీయులు మాట్లాడకపోవడం. మాట్లాడకపోతే భారతీయులు ఉండలేరు అని నానుడి. కానీ ఇప్పుడు భారతీయులలో ఆ లక్షణం పూర్తిగా మాయమవుతున్నది.

భజనకు మాత్రమే అలవాటుపడిపోయి….ఆర్థిక ప్రయోజనాల కోసం బానిసలుగా మారిపోయిన మీడియా సంస్థలన్నీ కూడా….. మహిళల శారీరక అందాలకు సంబంధించిన కథలు, బిసిసిఐ కోట్లు సంపాదించడానికి మాత్రమే ఉపయోగపడుతున్న క్రికెట్ విజయగాథలు, సినిమాలకు సంబంధించిన పనికిరాని గాసిప్స్, కులం, మతం, ప్రాంతం, దైవం అంటూ ఆలోచనాపరిధిని సంకుచితం చేసే విషయాలు మాట్లాడుకోవడానికి మాత్రమే మనల్ని పరిమితం చేయడంలో గొప్పగా విజయం సాధిస్తోంది. అంతకుమించి మన సమస్యల గురించి మనం మాట్లాడినా, ఆ సమస్యలకు కారణమైన వాళ్ళ తప్పుల గురించి ప్రశ్నించినా అధికారాన్ని అనుభవిస్తున్నవాళ్ళు, వాళ్ళ భజన చేస్తూ ప్రయోజనాలు పొందుతున్నవాళ్ళందరూ కూడా రెచ్చిపోతారు. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి, వాళ్ళకు బానిసలుగా, భక్తులుగా మారిపోయిన వాళ్ళను మనపైకి ఉసిగొల్పుతారు. ఆలోచనల్లో మరీ అథమ స్థాయి వ్యక్తులైతే వాళ్ళ స్థాయిలోనే రెచ్చిపోయి హింసకు దిగుతారు. కాస్త తెలివైన వాళ్ళు మాత్రం……‘ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’లాంటి డైలాగులు వినిపిస్తారు. ‘నువ్వే చెయ్యొచ్చుగా’ అంటూ అడ్డంగా వాదనకు దిగి మాట్లాడినవాళ్ళ నోళ్ళు మూయిస్తారు.

ప్రార్థించే పెదవుల వళ్ళ ఉపయోగం గురించి నాకు తెలియదు. కానీ ప్రశ్నించేవాళ్ళు, సమాజం గురించి మాట్లాడేవాళ్ళు మాత్రం కావాలి. మన చుట్టూ పన్నుతున్న పద్మవ్యూహం గురించి పరిధులు దాటి మరీ ఆలోచించే స్థాయికి రావాలి. అలాంటి ఆలోచనలతో తోటివారు కూడా ఆలోచించే స్థాయికి ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ రాజకీయాలను నిర్భయంగా చర్చించిన ఒక వడ్డెర చండీదాస్ మాట్లాడకపోపోయి ఉంటే…… ఒక ఎన్‌కౌంటర్ దశరథరామ్ మాట్లాడకపోయి ఉంటే…. గౌరీ లంకేష్ నాకెందుకులే అనుకుని ఉంటే……వీళ్ళనే కాదు……..ఇంకా చాలా మంది సమాజం కోసం మాట్లాడుతున్నవాళ్ళు ఉన్నారు. చరిత్రను చూసుకున్నా కూడా సోక్రటీస్‌లాంటి వాళ్ళు ఎందరో మాట్లాడబట్టే బానిస సంకెల్లు తెగి మనిషికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని తీసేసుకునే ప్రయత్నంలో మన పాలకులు ఉన్నారు. 2017వ సంవత్సరంలో అలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఈ సంవత్సరం ఇంకా ఉధృతంగా ప్రయత్నిస్తారు అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. మనం మౌనంగా ఉంటే, కనీసం సోషల్ మీడియాలో అయినా స్పందించకపోతే ప్రశ్నించేవాళ్ళ గొంతులు కూడా నొక్కేస్తారు. ప్రజలందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి మేం తీసుకునే నిర్ణయాలు మంచివే అని ప్రచారం చేసుకుంటారు. విష సర్పం కూడా తన ప్రాణాలు తాను కాపాడుకోవాలంటే కాటేసే ప్రయత్నం చేయకపోయినా కనీసం బుస కొడుతుంది. అలాంటిది వివేచన ఉన్న మనిషి స్పందించకపోతే, మాట్లాడకపోతే ఎలా?

పాలకుల నియంతృత్వ ఆలోచనలు నియంత్రణలోకి రావాలంటే ప్రజలు మాట్లాడాలి. అన్యాయాలు, అక్రమాలు, తప్పులపై స్పందించాలి. మూఢ భక్తులు, గుడ్డిగా నాయకుల మాటలను, మీడియా అబద్ధపు ప్రచారాలను నమ్మే జనాల్లో కూడా మార్పు రావాలి. వివేచన పెరగాలి. ఈ ఒక్క మార్పు చాలు….. భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నింటిలోనూ మార్పు రావడానికి…… పురోగతి కనిపించడానికి. అలా ప్రశ్నిస్తున్న అందరికీ, ఇకముందు ప్రశ్నించబోతున్న అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -