Friday, May 10, 2024
- Advertisement -

ఇదా తెలుగు మీడియా బతుకు…… వీళ్ళా జనాలకు నీతులు చెప్పేది?

- Advertisement -

అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మన మీడియా అధిపతులు ఎన్ని రకాల నీతులు చెప్తారో? అలాగే వాళ్ళు కష్టపడి ఎదిగి వచ్చిన వైనం గురించి కూడా కథలు కథలుగా చెప్తారు. వాళ్ళ నిబద్ధత, నిజాయితీల గురించి కూడా పేజీలకు పేజీలు రాసుకొస్తారు. కానీ ఆచరణలో మాత్రం అవేవీ కనిపించవు. కేవలం వ్యపార సూత్రాలు మాత్రమే కనిపిస్తుంటాయి. పాలకులతో కుమ్మక్కై కోటాను కోట్లు ప్రజల సొమ్మును అప్పనంగా కొట్టేయడమే కనిపిస్తూ ఉంటుంది. నాయకుల భజన చేయడం, దేశంలోనే ధనవంతులైన వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు కొమ్ముకాయడమే మన మీడియా వాళ్ళు చేస్తున్న పని. ఇక టీఆర్పీ రేటింగ్స్ కోసం వీళ్ళు ఆడే నాటకాలు కూడా అన్నీ ఇన్నీ కాదు. ఆత్మహత్యలపై మన మీడియా వ్యవస్థల తీరు గమనిస్తే చాలు…… వీళ్ళ అసలు రంగులన్నీ కనిపిస్తాయి. 2014 సంవత్సరం నుంచీ ఇప్పటి వరకూ ఎంతమంది నారాయణ కాలేజీల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు? రైతు ఆత్మహత్యలు ఎన్ని చోటు చేసుకున్నాయి? ఇక ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ……అధికారంలోకి వచ్చాక అదే నాయకులు అడ్డంగా మోసం చేస్తే నిరాశతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఎంత? రైతు రుణాలు మాఫీ అవ్వక ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు ఎంత మంది?అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న సినిమా నటులు ఎంతమంది?

రైతులు, నిరుద్యోగులు, నారాయణ విద్యార్థలు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడైనా గంటలు గంటలు చర్చలు నిర్వహించారా? పట్టుమని పది సినిమాల్లో కూడా నటించని ఒక నటుడు చనిపోతే మాత్రం వేరే ఏ విషయమూ లేనట్టుగా రెండు రోజుల పాటు వార్తలు ప్రచారం చేసింది మీడియా. మరి ఆ మరుసటి రోజే ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి….. అది కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి…… ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థి…… లక్షల్లో ఫీజులు కట్టి నారాయణ కాలేజీలో చేరితే చివరికి ఆ కాలేజీలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తోటి విద్యార్థులతో మాట్లాడితే అందరూ కూడా యాజమాన్యానిదే బాధ్యత అని చెప్తున్నారు. చనిపోయిన విద్యార్థి తెలివితేటలు, తొంభై ఐదు శాతంపైగా తను సాధించిన మార్కుల గురించి గొప్పగా చెప్తున్నారు. ఇక కాలేజీ యాజమాన్యం వేధింపుల గురించి కూడా గంటలు గంటలు చెప్తున్నారు. సినిమా నటుడు చనిపోతే అతని భార్య, అతని నాన్న, అతని తోటి నటులందరినీ ఇంటర్యూలు చేస్తూ, లైవ్ డిస్కషన్స్ పెట్టే మీడియా ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి చనిపోతే ఎందుకు పట్టించుకోదు. ఎందుకంటే సినిమా వాళ్ళ సెక్స్ స్టోరీలు అంటూ లేనిపోని కబుర్లు చెప్పుకోవడం దిగువస్థాయి ఆలోచనలు ఉన్న మనుషుల నైజం కాబట్టి. ఇప్పుడు జర్నలిస్టుల్లో కూడా ఆ బాపతు జనాలే ఎక్కువ కాబట్టి. సన్నీలియోన్…..ఇంకా ఆ బాపతు హీరోయిన్ల కథలంటే వాళ్ళకు ఆసక్తి కాబట్టి అలాంటి టేస్ట్ ఉన్న ప్రేక్షకుల కోసం ఆ కథలు వినిపిస్తూ ఉంటారు. విజయ్ ఆత్మహత్య గురించి, అతని ఆవేధన గురించి చెప్పాలన్నది మన మీడియా ఉద్ధేశ్యమే కాదు. కేవలం చుట్టూ అందరూ చెప్పుకుంటున్న ఆయా బూతు కథలను అమ్మి క్యాష్ చేసుకోవాలన్న ప్రయత్నం అంతే.

ఇక నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చుట్టూ అలాంటి కథలు లేవుగా….. మిడిల్ క్లాస్ పేరెంట్స్… ప్రతిభావంతుడైన విద్యార్థి…. లక్షల్లో ఫీజులు కట్టి ఆ కాలేజీలోనే బాధాకరమైన పరిస్థితుల నేపథ్యంలో చనిపోయిన పరిస్థితి. అందుకే మన మీడియాకు పెద్దగా ఆసక్తికరమైన వార్త కాకుండా పోయింది. అలాగే సదరు కాలేజీల అధినేత ఇప్పుడు వాళ్ళు భజన చేసే ముఖ్య నాయకుడికి మెయిన్ స్పాన్సర్ కాబట్టి అసలు వార్తే కాకుండా పోయింది. అదీ మన మీడియా ఫక్తు అవినీతి వ్యాపార ధోరణి. సీ ప్లేన్‌లో రెండోసారి విహరించాలన్న ముఖ్యమంత్రి సరదా ఎలా తీరిందో కథలు కథలుగా చెప్పే మీడియాకు నారాయణ విద్యార్థి ఆత్మహత్య గురించి చెప్పాలని మాత్రం అస్సలు అనిపించడం లేదు. ఇలాంటి మీడియాకు నీతులు చెప్పే అర్హత ఉందా? ఈ మీడియా చెప్పే మాటలు ప్రజలు మరోసారి నమ్మొచ్చా? ఇలాంటి మీడియా చెప్పే వార్తలన్నీ కూడా వాళ్ళ అవినీతి వ్యాపార ప్రయోజనాలకు సంబంధించినవి కావా? 2019లొ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సీమాంధ్ర ప్రజలు మరోసారి ఈ మీడియా అవినీతి, అబద్ధపు రాతలకు మోసపోతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -