Sunday, April 28, 2024
- Advertisement -

టీఆర్ఎస్ లీడర్స్ ఎన్ని తప్పులు చేసినా నో శిక్ష…. పర అనుకుంటే అంతా పనిష్మెంటే

- Advertisement -

తెలంగాణా ఉద్యమ సమయంలో ఎవని తల్లి? ఎవని భాష అని ఒక స్థాయిలో రెచ్చిపోయి విమర్శలు చేసి ఎందరినో నొప్పించిన కెసీఆర్ ఇప్పుడు మాత్రం తెలుగు భాషను చంద్రబాబు కంటే ఎక్కువగా….గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ పరిణామం నిజంగా చాలా గొప్పది. కేసీఆర్‌ని కచ్చితంగా అభినందించాల్సిందే. అయితే అన్ని విషయాల్లోనూ కేసీఆర్ తీరు ఇలానే ఉండడం మాత్రం ఆక్షేపణీయం. ఒకసారి తన అనుకుంటే వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తున్నాడు కెసీఆర్. కాదు ప్రత్యర్థులు అనుకుంటే మాత్రం అంతు చూసేదాకా వదలడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులు కూడా అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు.

ఒక ప్రైవేట్ స్కూల్‌ యాజమాన్యం ఒక విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. నిజానికి చైతన్య, నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యుల చేసుకుని చనిపోతున్న విద్యార్థిని, విద్యార్థుల చిత్రహింసలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న సంఘటననే. కానీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తానే స్వయంగా జోక్యం చేసుకుని అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. మంచిదే. ఒక విద్యార్థికి న్యాయం చేయడానికి ఉప ముఖ్యమంత్రి స్థాయి నేత రంగంలోకి దిగడం అభినందనీయమే. మరి అదే స్థాయి స్పందన చైతన్య, నారాయణ కాలేజీల విషయంలో ఎందుకు ఉండట్లేదు?

టీఆర్ఎస్ నేత ఒకడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేశాడు. భర్త ఇంటిముందు భార్య ధర్నాకు దిగింది. మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కనీస స్థాయి స్పందన కూడా లేదు. తెలంగాణాలో ఉన్న మహిళలు అందరికీ ప్రతినిధిని అని చెప్పుకునే కవిత కూడా కనీస స్థాయిలో కూడా స్పందించలేదు.

ఇక కెసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న మరొక నేత ఏకంగా ఒక చెరువును కబ్జా చేశాడు. ఆ విషయాన్ని స్వయంగా అసెంబ్లీలోనే టీఆర్ఎస్ మంత్రి ఒప్పుకున్నారు. కబ్జా చేసిన నాయకుడిపై ఏం చర్యలు తీసుకుంటారు అంటే మాత్రం సమాధానం ఉండదు. కేరళ రాష్ట్రంలో ఒక చెరువు కబ్జాకు పాల్పడిన ఒక మంత్రి విషయంలో తమ పార్టీ నాయకుడే అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఆ మంత్రి పదవిని ఊడబీకి కటకటాల వెనక్కి పంపించింది. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని తప్పులు చేసే అందరికీ స్పష్టమైన మెస్సేజ్ పంపించింది. మరి ఇక్కడ కెసీఆర్ నుంచి ఆ స్థాయి స్పందన ఊహించగలమా? టీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే తెలంగాణా ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళను కూడా తెలంగాణా ముద్దు బిడ్డలు, పోరాట యోధులు అన్నట్టుగా మాట్లాడే కెసీఆర్….టీఆర్ఎస్‌కి మద్ధతు తెలపకపోతే మాత్రం కోదండరాంని కూడా తెలంగాణా ద్రోహిగా చిత్రీకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ ఎన్నో విషయాల్లో హుందాతనం, పాలనా సామర్థ్యాన్ని మెరుగు పర్చుకున్న కేసీఆర్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఫక్తు రాజకీయ నాయకుడిలాగా స్పందిస్తున్నాడు. అలా కాకుండా అందరినీ సమానంగా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా స్పందిస్తే చరిత్రలోనే గొప్ప పాలకుడిగా నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. మరీ అత్యాశ అని అంటారా? తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు, చేతలకు… ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాటలు, చేతలకు ఎంత తేడా ఉందో చూడండి. అంత మార్పు చూపించగలిగిన కేసీఆర్‌కి ఇది మాత్రం అసాధ్యం ఎలా అవుతుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -