Tuesday, May 7, 2024
- Advertisement -

ఆఖ‌రిపోరులో విజేత ఎవ‌రు…?

- Advertisement -

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. శనివారం రాత్రి 9.30 నుంచి జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌తో సఫారీ గడ్డపై భారత్ తన పర్యటనని ముగించబోతోంది. గత బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 1-1తో సమం చేసి పోరుని మరింత ఆసక్తికగా మార్చేసింది.

భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత్ జట్టు తొలుత మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. అయితే.. అనంతరం జరిగిన ఆరు వన్డే సిరీస్‌లో తప్పిదాలను దిద్దుకుని సిరీస్‌ని ఏకంగా 5-1తో భారత్ చేజిక్కించుకుని సఫారీలకి దీటుగా బదులిచ్చింది.

దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి సారిగా 2015లో భారత్‌లో పర్యటించినప్పుడు టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడినా… వన్డే, టి20 సిరీస్‌లు రెండింటిని సొంతం చేసుకుంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో బదులివ్వాలంటే టీమిండియా టి20 సిరీస్‌ కూడా గెలుచుకోవాల్సి ఉంది.

శనివారం మూడో టీ20లో గెలిచిన జట్టే టీ20 సిరీస్‌లో విజేతగా నిలవనుండటంతో.. ఇరు జట్లు రెండో సిరీస్‌పై కన్నేసి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా.. భారత్ జట్టు రెండో టీ20 పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా సొంతగడ్డపై విజయంతో సిరీస్‌ని ముగించాలని ఆశిస్తోంది. స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టి రెండో టీ20లో సఫారీలను ఒంటిచేత్తో గెలిపించిన క్లాసెన్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

చాలా కాలంగా పరిమిత ఓవర్లలో చుక్కానిలా ఉన్న భారత్‌ టాపార్డర్‌ సెంచూరియన్‌లో అనూహ్యంగా విఫలమైంది. రోహిత్, ధావన్, కోహ్లి ముగ్గురూ ఒకేసారి తక్కువ స్కోర్లకే వెనుదిరగడం ఇటీవల ఎప్పుడూ జరగలేదు. అయితే అదీ ఒకందుకు మేలు చేసింది. మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ లోతు ఏమిటో తెలియగా, తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉంటే ఏం చేయగలడో ధోని చూపించాడు. రైనా రెండు మ్యాచ్‌లలో తన విలువను చూపించాడు. మరోసారి ఈ బ్యాటింగ్‌ లైనప్‌ చెలరేగాల్సి ఉంది. కేప్‌టౌన్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ మినహా ఒక్కసారి కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించలేకపోయిన పాండ్యాకు ఇది మరో అవకాశం. బౌలింగ్‌లో భువనేశ్వర్‌తో పాటు రాణించిన శార్దుల్‌ ఠాకూర్‌కు కూడా చోటు ఖాయం. బుమ్రా కోలుకోవడంపై ఇంకా స్పష్టత రాలేదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఉనాద్కట్‌ స్థానంలో కుల్దీప్‌ లేదా అక్షర్‌ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు.

మరోవైపు దక్షిణాఫ్రికా వన్డేల్లో పోయిన పరువును ఇక్కడైనా కాపాడుకునే ప్రయత్నంలో సిరీస్‌ గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్‌ను భార‌త్ విజ‌య‌వంతంగా ముగిస్తుందో చూడాలి.

జట్లు (అంచనా):
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌శర్మ, ధావన్‌, రైనా, మనీష్‌ పాండే, ధోని, హర్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌/కుల్‌దీప్‌ బుమ్రా/ఉనద్కత్‌
దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్‌), హెండ్రిక్స్‌, స్మట్స్‌, మిల్లర్‌, బెహర్డీన్‌, క్లాసన్‌, ఫెలుక్వాయో, మోరిస్‌, జూనియర్‌ డాలా, ప్యాటర్సన్‌/శంసి/ఫాంగిసో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -