Monday, April 29, 2024
- Advertisement -

ఒంటి చేత్తే చెన్నైకి ఐపీఎల్ టైటిల్‌ను అందించిన వాట్స‌న్‌..

- Advertisement -

రెండేళ్ల త‌ర్వాత ఐపీఎల్‌లో పున‌రాగ‌మ‌నం చేసిన చెన్నై జ‌ట్టు అద్భుతంగా ఆడి టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయింది. ఐపీఎల్‌లో తమ జట్టుకి తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి నిరూపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ (117 నాటౌట్: 57 బంతుల్లో 11×4, 8×6) మెరుపు శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌‌ని ఎగరేసుకుపోయింది.

బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్‌ పఠాన్‌ (25 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్‌ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్‌ గుర్తింపు పొందగా, సురేశ్‌ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం.

ఛేదనలో ఓపెనర్ డుప్లెసిస్ (10) విఫలమైనా.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన వాట్సన్ మిడిల్ ఓవర్లలో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6, 6, 4 బాదేసి ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. ఇక్కడ నుంచే హైదరాబాద్ చేతుల్లోంచి పూర్తిగా మ్యాచ్ చేజారిపోయింది.

అంతకముందు ఓపెనర్ శ్రీవాత్సవ గోస్వామి (5) ఆరంభంలోనే పేలవ రీతిలో రనౌటవగా.. అనంతరం వచ్చిన విలియమ్సన్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (26: 25 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి రెండో వికెట్‌కి అర్ధశతక భాగస్వామ్యంతో హైదరాబాద్‌ని ఆదుకున్నాడు. అయితే.. కీలక సమయంలో ధావన్‌ని జడేజా, విలియమ్సన్‌ని కర్ణ్ శర్మ ఔట్ చేయడంతో.. హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగింది. మధ్య ఓవర్లో షకీబ్ అల్ హసన్ (23: 15 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోగా.. దీపక్ హుడా (3) నిరాశపరిచాడు. అయితే ఆఖర్లో యూసఫ్ పఠాన్, కార్లోస్ బ్రాత్‌వైట్ చెన్నై బౌలర్లపై వరుస సిక్సర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డుని అమాంతం పెంచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -