Thursday, May 9, 2024
- Advertisement -

టాలీవుడ్‌కు క‌లిసొచ్చిన 2017

- Advertisement -

కాల‌గ‌ర్భంలో ఓ సంవ‌త్స‌రం క‌లిసిపోనుంది. కాలాలు మారుతుంటాయి.. రుతువులు మారుతుంటాయి.. రోజులు మారుతుంటాయి.. సంవ‌త్స‌రాలు మారుతుంటాయి.. ఆ విధంగానే 2017 ముగిసిపోయింది. అయితే ఈ సంవ‌త్స‌రం రాజ‌కీయాల్లో పెను మార్పులు, వాతావ‌ర‌ణంలో కొత్త మార్పులు, అన్ని రంగాల్లో కొత్త కొత్త మార్పులు చేసుకొని కొత్త పుంత‌ల‌కు 2018 సంవ‌త్స‌రం అవ‌కాశం వ‌చ్చింది. అయితే 2017 సంవ‌త్స‌రం మాత్రం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు కాదు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు బాగా క‌లిసొచ్చింది. ప్ర‌పంచ స్థాయికి మ‌న సినిమా పోవ‌డ‌మే కాకుండా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌ల‌ను కొల్ల‌గొట్టాయి.. మ‌ళ్లీ ఎన్నో వివాదాలు చుట్టుముట్టుకున్నాయి. చివ‌రికి కొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయ అనేంత స్థాయికి మారి వెళ్లిపోయినవి కూడా ఉన్నాయి. ఇలా మంచి చెడు భావిస్తే మంచి ఎక్కువ‌గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు క‌ల‌గింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ రౌండ‌ప్‌ను ఆద్య న్యూస్ అందిస్తోంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మూడు, నాలుగు కాలాలు బాగా క‌లిసొచ్చేవి ఉన్న‌వి. ఒక‌టి సంవ‌త్స‌రం ప్రారంభం సంక్రాంతి పండుగ‌, రెండు వేస‌వి, మూడు ద‌స‌రా, దీపావ‌ళి స‌మ‌యం, నాలుగు క్రిస్మ‌స్‌, సంవ‌త్స‌రం ముగింపు. ఇలా ఈ కాలాల్లో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పండుగ వాతావ‌ర‌ణ‌మే. అలాంటిదే చూద్దాం.

జ‌న‌వ‌రి

2017 ప్రారంభ‌మే సంక్రాంతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు జోష్ వ‌చ్చింది. ఒకేసారి ఐదారు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, శ‌ర్వానంద్ సినిమాలు తీవ్ర పోటీ మ‌ధ్య విడుద‌ల‌య్యాయి. ఒక‌టికి మించి ఒక‌టి సినిమా ఉండ‌డంతో థియేట‌ర్లు స‌రిపోలేదు. వారం వ‌ర‌కు థియేట‌ర్ల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో నిండిపోయాయి. ఆ విధంగా సంవ‌త్స‌రం ప్రారంభ‌మే జ‌రగ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు కలిసొచ్చింది. ల‌క్కునోడుగా మంచు విష్ణు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు.

ఫిబ్ర‌వ‌రి
నాని నేను లోక‌ల్ అని సంద‌డి చేసి హిట్ కొట్టాడు. ఘాజీ సినిమాతో రానా బంప‌ర్‌హిట్ కొట్టాడు. ఈ సినిమా అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంది. విభిన్న క‌థాంశంతో భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లోనే జ‌లాంత్గామితో తీసిన తొలి సినిమా ఇది. సాయిధ‌ర‌మ్‌తేజ్ విన్న‌ర్‌గా వ‌చ్చి ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకున్నాడు. నాగార్జున, అనుష్క‌ల‌తో రాఘవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయ సినిమా వ‌చ్చింది. ఇంకా కొన్ని చిన్న సినిమాలు వ‌చ్చి వెళ్లాయి.

మార్చి
ఈనెల‌లో పెళ్లిచూపులు సినిమాతో ఊపు మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ద్వార‌క సినిమాతో వచ్చాడు. ఎంతో హైప్‌తో వ‌చ్చిన ఈ సినిమా ప‌రాజ‌యం పొందింది. మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యాజైస్వాల్ న‌టించిన గుంటూరోడు సినిమా వ‌చ్చింది. రాజ్ త‌రుణ్‌, అనూ ఇమ్మాన్యుయేల్ క‌లిసి కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమా విడుద‌లైంది. ఎన్నో అంచ‌నాల‌తో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడిగా వ‌చ్చి ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకొని వెళ్లిపోయాడు. సీనియ‌ర్ న‌టుడు వెంక‌టేశ్ గురుగా వ‌చ్చి విజ‌యం పొందాడు. ఇక కొత్త హీరోతో పూరీ జ‌గ‌న్నాథ్ రోగ్ సినిమాను విడుద‌ల చేశాడు. సాయిరాం శంక‌ర్ నేనోర‌కం, న‌య‌న‌తార డోర‌, సందీప్ కిష‌న్ నగ‌రం, ఇంకా ఆక‌తాయి, అంజ‌లి చిత్రాంగ‌ద‌, మంచుల‌క్ష్మీ ల‌క్ష్మీబాంబ్ త‌దిత‌ర సినిమాలు వ‌చ్చాయి.

ఏప్రిల్ (వేస‌వి)
భారతీయ సినీ చరిత్రలోనే భాషా భేదం లేకుండా.. ప్రాంతీయ భేదాలు లేకుండా.. ఆదరించిన సినిమా ‘బాహుబలి: ది కంక్లూజన్’. ఏకంగా రూ.1750 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రమిది. ‘బాహుబలి-2’ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించింది. అంచనాల్ని మించిపోయి అసాధారణ విజయం సాధించి తెలుగు జాతికి గ‌ర్వంగా నిలిపిన సినిమా ఇది. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా మిస్ట‌ర్ సినిమా అంచ‌నాల‌తో వ‌చ్చి క‌న‌ప‌డ‌కుండాపోయింది. రాశి న‌టించిన లంక‌, లారెన్స్ శివ‌లింగ‌, కార్తీ చెలియా సినిమాలు విడుద‌ల‌య్యాయి.

మే
మండే మండు వేస‌విలో కొన్ని సినిమాలు వ‌చ్చి నిల‌దొక్కుకున్నాయి. అక్కినేని నాగ‌చైత‌న్య‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా రారండోయ్ వేడుక చూద్దాం, శ‌ర్వానంద్ రాధ‌గా, నిఖిల్ కేశ‌వ‌, అవ‌స‌రాల శ్రీనివాస్ బాబు బాగా బిజీ సినిమాలు వ‌చ్చాయి. రాధ ఆడ‌లేదు. కేశ‌వ‌, బాబు బాగా బిజీ సినిమాలు థియేట‌ర్ల‌లో కొన్ని రోజులు నిలిచాయి. ఇంకా వెంక‌టాపురం, శ్రీరాముడింట శ్రీకృష్ణుడు, ర‌క్ష‌క భ‌టుడు త‌దిత‌ర సినిమాలు వ‌చ్చాయి.

జూన్‌
ఈ నెల‌లో అల్లు అర్జున్‌, ఆది పినిశెట్టి, గోపిచంద్‌, అవ‌స‌రాల శ్రీనివాస్, సుమంత్ అశ్విన్‌, రాజ్ త‌రుణ్‌ త‌దిత‌రుల సినిమాలు విడుద‌ల‌య్యాయి. పూజా హెగ్డే, అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ విడుద‌ల‌య్యి మంచి మార్కులు కొట్టింది. మర‌క‌త‌మ‌ణి, ఆర‌డ‌గుల బుల్లెట్‌, అమీ తుమీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడిస్ టైల‌ర్‌, అంధ‌గాడు, కాద‌లి త‌దిత‌ర సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి.

జూలై
ఈనెల‌లో బొచ్చెడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వచ్చాయి. ఒక్క ఫిదా మాత్రం ఇప్ప‌టికీ గుర్తండిపోయేలా ఆడింది. సాయిప‌ల్ల‌వి, వ‌రుణ్‌తేజ్ న‌టించిన ఫిదా థియేట‌ర్ల‌లోకి జ‌నాల‌ను తీసుకొచ్చి నిలిచింది. 2017 ముగిసినా గుర్తిండిపోయే చిత్రంగా నిలిచింది. ఇంకా నాని నిన్నుకోరిగా వ‌చ్చి హిట్ పొందాడు. గోపీచంద్ గౌత‌మ్‌నంద‌గా వ‌చ్చి సోసో ఆడి వెళ్లాడు. బి.జ‌య ద‌ర్శ‌క‌త్వంలో వైశాఖం సినిమా కూడా బాగానే ఆడింది. వాసుకి, రెండు రెళ్లు ఆరు, ప‌టేల్ సార్‌, శ‌మంత‌క‌మ‌ణి, మాయామాల్‌, దండుపాళ్యం-2, ఏజెంట్ భైర‌వ‌, రాక్ష‌సి త‌దిత‌ర సినిమాలు వ‌చ‌చాయి.

ఆగ‌స్టు
ఈనెల‌లో కొత్త క‌థాంశంతో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చి బంప‌ర్ హిట్ కొట్టాడు. ఆ సినిమానే అర్జున్‌రెడ్డి. ఆ త‌ర్వాత రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇక నితిన్ లై సినిమా బాగున్నా ఆడలేదు ఎందుకో. బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన జ‌య నాయ‌కి నాయ‌క సినిమా ఎంతో ఆర్బాటంగా విడుద‌లైంది అంతే ప్రేక్ష‌కుల‌ను రాబ‌ట్ట‌లేదు. తాప్సీ న‌టించిన థ్రిల్ల‌ర్ సినిమా ఆనందోబ్ర‌హ్మ‌, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌క్ష‌త్రం, ద‌ర్శ‌కుడు, వివేకం, వీఐపీ-2 త‌దిత‌ర సినిమాలు వ‌చ్చాయ‌ని చెప్పుకోవాలి.

సెప్టెంబ‌ర్
ఈనెల తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పండ‌గనే తెచ్చింది. పెద్ద‌పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యాయి. ప్రిన్స్ మ‌హేశ్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, శ‌ర్వానంద్‌, బాల‌కృష్ణ‌, నాగ‌చైత‌న్య సినిమాలు వ‌చ్చాయి. మ‌హేశ్ స్పైడ‌ర్ సినిమా బాగుంది. కానీ ఆడ‌లేదు. ఆ త‌ర్వాత జై ల‌వ‌కుశ సినిమా వ‌చ్చి మంచి హిట్ కొట్టి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత శ‌ర్వానంద్ మ‌హానుభావుడుగా వ‌చ్చి హిట్ వేసుకున్నాడు. బాల‌కృష్ణ పైసా వ‌సూల్ అంటూ వ‌చ్చి వ‌సూల్ చేయ‌కుండానే వెళ్లిపోయాడు. నాగ‌చైత‌న్య యుద్ధం శ‌ర‌ణం, సునీల్ ఉంగ‌రాల రాంబాబు, అల్ల‌రి న‌రేశ్ మేడ‌మీద అబ్బాయి ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు. ఇంక శ్రీవ‌ల్లీ, స‌ర‌సుడు, క‌థ‌లో రాజ‌కుమారి వంటి సినిమాలు వ‌చ్చాయి.

అక్టోబ‌ర్‌
ఈనెల‌లో రామ్‌, ర‌వితేజ‌లు వ‌చ్చి హిట్ కొట్టారు. రామ్ న‌టించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, ర‌వితేజ రాజా ది గ్రేట్ సినిమాల‌తో వ‌చ్చి మంచి విజ‌యాలు అందుకున్నారు. నాగార్జున‌, స‌మంత రాజుగారి గ‌ది-2 సినిమాతో వ‌చ్చిన ఆశించినంత ఆడ‌లేదు. విడుద‌లైన వాటిలో గ‌ల్ఫ్‌, ఓయ్ నిన్నే, నేను కిడ్నాప్ అయ్యాను త‌దిత‌ర సినిమాలు ఉన్నాయి.

న‌వంబ‌ర్‌
ఈనెలలో చాలా సినిమాలు వ‌చ్చినా రెండో మూడో చెప్పుకోద‌గ్గ సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లోకి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయాయి. గోపిచంద్ ఆక్సిజ‌న్‌గా వ‌చ్చాడు. సీనియ‌ర్ హీరో గరుడ‌వేగ సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా శ్రీవిష్ణు న‌టించిన మెంట‌ల్ కృష్ణ సినిమా బాగానే ఆడింది. ఏంజిల్‌, ఖాకీ, స్నేహ‌మేరా జీవితం, ఇంద్ర‌సేన‌, దేవీశ్రీప్ర‌సాద్‌, లండ‌న్‌బాబులు, గృహం, కేరాఫ్ సూర్య‌, నెక్ట్స్ నువ్వే త‌దిత‌ర ఇంకా చాలానే చిన్న సినిమాలు వ‌చ్చాయి.

డిసెంబ‌ర్‌
చివ‌రి నెల‌లో బాగానే సినిమాలు వ‌చ్చాయి. నాని మిడిల్ క్లాస్ అబ్బాయ్‌గా వ‌చ్చి మూడో హిట్టు కొట్టుకున్నాడు. హ‌లో సినిమాతో అఖిల్ వ‌చ్చి త‌న కెరీర్‌లో చిన్న‌పాటి విజ‌యం సాధించాడు. అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణంగా వ‌చ్చి బాగానే ఆడుతున్నాడు. ఇంకా కొన్ని చిన్న సినిమాలు వ‌చ్చాయి. గుర్తు ప‌ట్టేంత సినిమాలు ఏమీ కావు.

ఈ విధంగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఈ నెల‌లో థియేట‌ర్లు సినిమాలు లేక ఖాళీగా ఉన్న‌ట్టు తెలియ‌దు. అయితే అందులో విజ‌యాలు ఎన్నో ఉన్నాయి. ప‌రాజ‌యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప‌ట్టించుకోకుండా సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆద‌రిస్తే దాన్ని న‌మ్ముకొని ఉన్న ఎంద‌రికో ఉపాధి ల‌భించే అవ‌కాశం క‌ల్పిద్దాం. చివ‌ర‌గా పైర‌సీని నిరోధించ‌డానికి మ‌న వంతు కృషి చేస్తే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ బ‌తుకుతుంది. పైర‌సీ భూతం 2017 సంవ‌త్స‌రంలో బాగానే ప్ర‌భావం చూపింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా విడుద‌లైన రోజే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ విధంగా 2017కు బాయ్‌బాయ్ చెబుతూ 2018లో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రపురాని విజ‌యాలు రావాల‌ని ఆకాంక్షిస్తూ ఆద్య న్యూస్ చెబుతోంది.. హ్య‌పీ న్యూ ఇయ‌ర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -