Wednesday, May 1, 2024
- Advertisement -

విశాల్ ‘అభిమన్యుడు’ రివ్యూ

- Advertisement -

తమిళంలో ఇతర కథానాయకులతో పోలిస్తే విశాల్‌ శైలి కాస్త భిన్నం. ఇటవలే ‘డిటెక్టివ్‌’ అంటూ ఓ కొత్త తరహా కథతో ఆకట్టుకున్న ఆయన తాజాగా లక్షల మంది ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాల నేపథ్యంలో తీసిన చిత్రం ‘అభిమన్యుడు’. ‘ఇరుంబు తిరై’గా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభిమన్యుడు’ ఎలా ఉన్నాడు? సైబర్‌మోసాలను ఎలా ఎదుర్కొన్నాడు? విశాల్‌ ఖాతాలో మరో విజయం పడిందా?

కథ: విశాల్‌‌(కరుణాకర్‌) మిలటరీ ఆఫీసర్‌. కోపం ఎక్కువ. తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సహించలేడు. ఆ కోపం కారణంగానే సస్పెండ్‌కు గురవుతాడు. కోపాన్ని తగ్గించుకోవడానికి యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ క్లాస్‌లు తీసుకుంటాడు. ఇందుకోసం సమంత (లతాదేవి) అనే డాక్టర్‌ను కలుస్తాడు. కరుణ కోపానికి కారణం అతని గతమేనని తెలుసుకుంటుంది లత. అందుకే ఎప్పుడో వదిలేసిన ఇంటికి మళ్లీ వెళ్లమని సలహా ఇస్తుంది. దాంతో కరుణ తన ఊరికి వెళ్తాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేయడానికి పూనుకుంటాడు. అందుకోసం రూ.10లక్షలు అవసరం అవుతాయి.

ఊరిలో ఉన్న ఆస్తిని రూ.4లక్షలకు అమ్మి, మరో ఆరు లక్షలు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. బ్యాంకులో పడిన రూ.10లక్షలు సడెన్‌గా మాయం అవుతాయి. ఆ పదిలక్షలు మాయం చేసింది వైట్‌ డెవిల్‌(అర్జున్‌). కరుణ పదిలక్షలు మాత్రమే కాదు. ఇలా కొన్ని వందల, వేల మంది బ్యాంకు అకౌంట్లను హ్యాక్‌ చేసి ఆ సొమ్మును తన ఖాతాలోకి మార్చుకుంటాడు వైట్‌ డెవిల్‌. ఇంతకీ వైట్‌ డెవిల్‌ ఎవరు? అతని సామ్రాజ్యాన్ని కరుణ ఎలా నేల మట్టం చేశాడు? అన్నదే కథ

విశ్లేష‌ణ : సినిమా మొత్తం సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో సాగుతుంది. మనం రోజూ పేపర్లో చూస్తున్న విషయాలే ఇవి. మన అకౌంట్‌లో డబ్బులను మన ప్రమేయం లేకుండానే ఎవరో దర్జాగా దొంగిలిస్తున్నారు. ఈ సమస్యను దర్శకుడు కథగా ఎంచుకున్నాడు. దాని మూలాల్లోకి వెళ్లి సైబర్‌క్రైమ్‌ జరిగే పద్ధతిని చాలా విపులంగా అందరికీ అర్థమయ్యేలా సైబర్‌క్రైమ్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసేలా చూపించాడు. కథ ప్రారంభమైన కాసేపటికే ఇటీవల విడుదల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే రెండు చిత్రాల్లో కథానాయకుల క్యారెక్టర్‌ ఒకేలా ఉంటుంది. కానీ, కథ నడుస్తున్న కొద్దీ సైబర్‌క్రైమ్‌ అనే వ్యవహారం జోడించిన తర్వాత ‘అభిమన్యుడు’ కొత్తదారిలోకి వెళ్తుంది. ఒక పక్క సైబర్‌క్రైమ్‌, మరోవైపు కరుణ జీవితాన్ని సమాంతరంగా చూపిస్తూ రెండు కథలను ఒక చోట ముడిపెట్టాడు దర్శకుడు.ఎప్పుడైతే సమస్య తన వరకూ వచ్చిందో దాన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగుతాడు కథానాయకుడు. అక్కడి నుంచి కథలో వేగం వస్తుంది. ద్వితీయార్ధం మొత్తం హీరో-విలన్ల మధ్య పోరాటమే. బలమైన ప్రతినాయకుడి పాత్రను రాసుకుంటే సన్నివేశాలు ఎంత బాగా వస్తాయో చెప్పడానికి ‘అభిమన్యుడు’ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

నటీనటులు: విశాల్‌ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అనవసరమైన హీరోయిజాల జోలికి పోకుండా పాత్రకు తగ్గటు ఎక్కడ ఏం చేయాలో అదే చేశాడు. ఈ కథకు ఆత్మ వైట్‌ డెవిల్‌ పాత్ర. అర్జున్‌ రాకతో ఈ కథ స్వరూపమే మారిపోతుంది. అతని స్టైలిష్‌ నటనతో ఈ పాత్రనే కాకుండా కథను కూడా వేరే స్థాయిలోకి తీసుకెళ్లాడు. విశాల్‌-అర్జున్‌ల మధ్య సాగే సన్నివేశాలు, వాళ్లు వేసుకునే ఎత్తుకు పైఎత్తులే ఈ సినిమాను నెలబెట్టాయి. సమంతది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రే. సమంతలాంటి స్టార్‌ హీరోయిన్‌ ఉంది కదాని.. దర్శకుడు డ్యూయెట్ల జోలికి పోలేదు. విశాల్‌-సమంతల మధ్య ఒకే ఒక పాట తీశాడు. మిగిలిన వాళ్లు అందరూ తమిళ నటీనటులే.

సాంకేతివర్గం: దర్శకుడి ఆలోచన బాగుంది. సైబర్‌క్రైమ్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ద్వితీయార్ధంలో అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. యువన్‌ సంగీతం ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేయగలిగాడు. జార్జ్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుందివిజయ్‌మాల్యాకు సంబంధించిన డైలాగ్‌లు ఏటీఎం మిషన్‌కు, ఓటింగ్‌ యంత్రానికి పోలిక చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి.

బోట‌మ్ లైన్: పద్మవ్యూహం ఛేదించిన ‘అభిమన్యుడు’

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -