Friday, May 3, 2024
- Advertisement -

బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్‌..మార్పు తప్పదా?

- Advertisement -

బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్ స్వయంగా తమ పేర్లను ప్రకటించినా బీ ఫామ్ వచ్చేదాక టికెట్ దక్కేది కష్టంగానే ఉంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లను మార్చడం, పలు చోట్ల సీట్లు ఆశీంచిన నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌తో పాటు పటాన్ చెరు,ఉప్పల్‌తో పాటు పలు నియోజకవర్గాల్లో నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్, పటాన్ చెరువు నియోజకవర్గాల్లో తమ సామాజికవర్గాన్ని తెరపైకి తెచ్చి రోజువారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక అసంతృప్తులను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇక మల్కాజ్‌గిరిలో మైనంపల్లి పేరు మార్చడం దాదాపు ఖాయమైంది. ఆయన మల్కాజ్‌గిరితో పాటు తన కొడుకు కోసం మెదక్ సీటు అడగడమే కాదు పలుమార్లు హరీష్‌ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనపై వేటు దాదాపు ఖాయం కాగా ఈ స్థానం నుండి బొంతు రామ్మోహన్ లేదా తలసాని సాయి కిరణ్ పేరు వినిపిస్తోంది.

ఈ స్థానాలే కాదు దాదాపు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని స్వయంగా బీఆర్ఎస్ నేతలే డిమాండ్ చేస్తుండటం సీఎం కేసీఆర్‌కు తలనొప్పిగా మారింది. ఇక కొంతమంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లినా వీరిని వ్యతిరేకించే నేతల నుండి విమర్శలు వస్తుండటంతో క్యాడర్ సైతం అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులను ప్రచారానికి వెళ్లవద్దని సీఎం కేసీఆర్ స్వయంగా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మార్పు ఉంటుందనే సంకేతాలను తమ అనుకూల మీడియా ద్వారా పంపుతున్నారు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొనగా ఆశావాహులు కాస్త ధైర్యంతో ఉన్నారు. ఏదిఏమైనా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందున్నామని హ్యాపీగా ఫీలయినా బీఆర్ఎస్ నేతలకు ఆ సంతోషం ఎక్కువరోజులు లేకుండాపోయింది. మరి సీఎం కేసీఆర్ నిజంగా అభ్యర్థులను మారుస్తారా లేదా తాను తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందుకుసాగుతారా అన్నది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -