Sunday, April 28, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏపీలో అడుగు పెట్టను

- Advertisement -

యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేకహోదాపైనే అని ఏఐసీసీ అధ్యక్షుడు, యూపీఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ కర్నూలు బహిరంగ సభ సాక్షిగా మరోసారి వాగ్ధానం చేశారు. తాను తప్పుడు వాగ్ధానాలు చేసే వ్యక్తిని కాదని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేశాకే మళ్లీ ఆంధ్రాలో అడుగు పెడతానని శపథం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వబోయే గిఫ్ట్ కాదని, ఆంధ్రుల హక్కు అని రాహుల్ స్పష్టం చేశారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ప్రత్యేకహోదాపైనే అని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. హోదా అనేది ఏపీకి బహుమతి కాదని, దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని, అది బాకీ అని చెప్పారు. ఏపీ ప్రజల బాకీ తీర్చాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా ఎవరున్నా వారిపై ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి హోదా ఇవ్వకుండా మోసం చేశారని రాహుల్ మండిపడ్డారు. అందుకే ప్రధాని కుర్చీకి ఏపీ ప్రత్యేకహోదాకు సంబంధం ఉందని చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని వాటన్నింటిని మోడీ సర్కార్ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడప ఉక్కు కర్మాగారం, హామీలు నెరవేర్చుతామన్నారు.

మోడీ సర్కార్ ఆర్థిక నేరగాళ్లను వెనకేసుకొస్తోందని, సామాన్యులు, మథ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని రాహుల్ మండిపడ్డారు. బ్యాంకులను కొల్లగొట్టిన వారికి రక్షణ కల్పిస్తూ దేశం దాటిపోయేలా సహకరించిన ఘనులు మోడీ ప్రభుత్వంలో ఉన్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే ఏపీకి ప్రత్యేకహోదాపై ఆయన చేసిన శపథం, ఇచ్చిన హామీపై ప్రజల నుంచి పెద్దఎత్తున సానుకూల స్పందన వచ్చింది. హర్షద్వానాలు మిన్నంటాయి. గత నాలుగేళ్లుగా ఏపీలో కనీసం ఉనికి కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సభ ఫుల్ జోష్ నింపింది. రాహుల్ హిందీ ఇంగ్లిష్ లో ప్రసంగిస్తుంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలుగులో అనువాదం చేసి మరీ ప్రజలకు కాంగ్రెస్ హామీలను వివరించారు. ప్రత్యేకంగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజల్లో ఆ సానుకూల స్పందన రావడం, సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. మళ్లీ తమకు ఆంధ్రప్రదేశ్ లో పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిసహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను మళ్లీ చేర్చుకుంటున్న కాంగ్రెస్, తెరవెనుక భారీగానే చర్చలు జరుపుతోంది. ఇప్పుడు రాహుల్ సభ సక్సెస్ కావడంతో ఇక కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఊపందుకుంటాయని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -