Tuesday, April 30, 2024
- Advertisement -

సొరంగం త‌వ్వారు.. ల‌క్ష‌లు కొల్ల‌గొట్టిన‌ కేటుగాళ్లు

- Advertisement -

సుల‌భంగా డ‌బ్బులు సంపాదించాల‌నే దురుద్దేశ్యంతో కొన్ని ముఠాలు కొత్త ఆలోచ‌న‌ల‌కు తెర‌లేపుతున్నారు. అలాంటి సంఘ‌ట‌నే తెలంగాణాలో చోటు చేసుకుంది. సొరంగం త‌వ్వి డీజిల్ పైపులైన్‌కే రంద్రం వేసి కోట్లు కొల్ల‌గొట్టారు కేటుగాళ్లు.

పన్నెండు మంది సభ్యులతో కూడిన ఓ ముఠా మూడు మీటర్ల లోతు.. రెండు మీటర్ల మేర సొరంగం తీసి పైప్‌లైన్‌కు మోటారు బిగించారు. ఆ మోటారు ఆధారంగా రూ.కోటి విలువైన డీజిల్‌ను చోరీచేశారు. డీజిల్‌ విడుదల, సరఫరాకు మధ్య పొంతన లేకపోవడంతో ఈ గుట్టు వీడింది.

రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం… ఘట్‌కేసర్‌ నుంచి చర్లపల్లి ఐఓసీఎల్‌/బీపీసీఎల్‌ అయిల్‌ సంస్థల నిల్వ కేంద్రాలకు ఆయిల్‌ సరఫరా చేసేందుకు 17 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్‌ ఉంది. మహారాష్ట్ర, థానే జిల్లా ముమ్రాకు చెందిన హఫీజ్‌ అజీజ్‌ చౌదరి, ముంబైలోని శివడీ లేబర్‌ అడ్డాలో ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌ వాసి జియాహుల్‌ చంద షేక్‌ అలియాస్‌ చెడ్డా స్నేహితులు. వీరికి మహబూబ్‌నగర్‌కు చెందిన బిన్ని శ్రీనివాసులు అలియాస్‌ శ్రీనుతో పరిచయం ఉంది.

కీసర పోలీస్టేషన్‌ పరిధిలో మహేందర్‌గౌడ్‌ అనే వ్యక్తికి చెందిన ఒక ఎకరం స్థలాన్ని పాత ఇనుప సామానును నిల్వ చేస్తామంటూ గత ఏడాది అక్టోబరులో లీజుకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి డీజిల్‌ పైప్‌లైన్‌ 2మీటర్ల దూరంలో ఉంది. నాలుగు నెలల క్రితం ఈ షెడ్డు అంతర్భాగం నుంచి పైపులైన్‌ వద్దకు 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో సొరంగాన్ని తవ్వారు. చమురు సంస్థల పైపు బయటపడ్డాక పైపులైన్‌కు క్లాంప్‌లు బిగించి రెండు అంగుళాల రంద్రం చేశారు.

ఆ తర్వాత చిన్న మోటారును బిగించి చిన్న పైప్‌ ద్వారా డీజిల్‌ను లాగేవారు. దాన్ని ట్యాంకర్లలోకి లోడ్‌చేసి తీసుకెళ్లేవారు. లీజు.. సొరంగం పనులను అక్టోబరు, నవంబరుల్లో పూర్తిచేసి.. డిసెంబరు నుంచి రూ.కోటి విలువైన 1,30,601 కిలో లీటర్ల డీజిల్‌ను తస్కరించారు.

ఘట్‌కేసర్‌ నుంచి తమ సంస్థకు బంకుల్లోకి సరఫరా అవుతున్న డీజిల్‌ పరిమాణంలో తేడా రావడం రెండు సంస్థల ప్రతి నిధులు గత ఏడాది డిసెంబరు 3న గుర్తించారు. దాంతో కీసర పోలీసులను ఆశ్రయించారు. సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి సీసీఎస్‌, కీసర పోలీసులు 17కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా విచారణ జరిపారు.

ప్రధాన నిందితుడు చందశేఖర్‌ చెడ్డా సహా 8మంది పరారీలో ఉండగా, హఫీజ్‌ అజీజ్‌ చౌదరి, బిన్ని శ్రీను, మహ్మద్‌ అబ్దుల్‌ అబ్రార్‌, మారోజు జయకృష్ణలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 90.4లక్షల నగదు, ఒక ట్యాంకర్‌, కారు, యాక్టివా బైక్‌, ఎలక్ట్రిక్‌ మోటారు, పైపులను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -