Tuesday, April 30, 2024
- Advertisement -

దేశాన్ని కుదిపేస్తున్న #మీటూ కలకలం

- Advertisement -

లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మీడియా ప్రతినిధులు, రాజకీయనేతలు ఇలా అన్ని రంగాల వారినీ మీటూ ఉద్యమం రోడ్డుకు లాగేస్తోంది. అవకాశాల పేరుతో, మగతనం అనే దురహంకారంతో, కామంతో తమను పలువురు వేధించారని సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. ఒక్కో రంగంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రముఖుడిపై వెళ్లువెత్తుతున్న ఆరోపణలు ఇప్పుడు దేశమంతా చర్చకు దారి తీశాయి. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నన్ను వేధించాడు అంటూ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ దర్శకుడు వికాశ్ పాహల్ పైనా ఇవే తరహా ఆరోపణలు చేసింది. 2014లో క్వీన్ లో నటిస్తున్నప్పుడే నన్ను వేధించాడు. తనతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడని కంగనా ఆరోపించింది. క్వీన్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వికాస్‌ రోజుకో అమ్మాయితో ఎంజాయ్‌ చేసేవాడని చెప్పింది. షూటింగ్ తర్వాత తనని హగ్‌ చేసుకునే వాడని, తన మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడని, అతని కౌగిలి నుంచి విడిపించుకోవడాని చాలా బాధ పడేదాన్ని చెప్పుకొచ్చింది. దక్షిణాది గాయని చిన్మయి నేను కూడా బాధితురాలనే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు గాయనిగా అవకాశాల కోసం తన తల్లి రికార్డింగ్ స్టూడియోలకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ ముసలాయన తన ఒంటిమీద వేయరాని విధంగా చేతులు వేశాడని ఆరోపిస్తోంది. తాను ఆనాడే తల్లికి ఆ విషయం చెప్పానని గుర్తు చేసింది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రామసామి తనను ఇదేవిధంగా లైంగికంగా వేధించాడని మరో బాధితురాలు ముందుకొచ్చింది. అతడి వద్ద పనిచేసే కాలంలో తనను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేసేవాడని, ఆరోపిస్తోంది. జాతీయ అవార్డులు అందుకున్న అతడి గురించి పరిశ్రమలో చాలామందికి తెలుసు కానీ బయట పెట్టరని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

20 ఏళ్ల క్రితం గొప్ప సంస్కారవంతుడుగా పేరొందిన సినీ, టీవీ టెలివిజన్‌ నటుడు అలోక్‌నాథ్‌ తనపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడని, ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్‌ వింటా నందా తన అనుభవాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్‌ రేప్‌ చేశాడని ఆరోపించింది. తనతో పాటు 90వ దశకంలో ప్రముఖ నటీమణులను ఇలాగే వేధించాడని, ఆతడి బాధ పడలేక ఫిర్యాదులు చేసిన వారికి అవకాశాలు లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. నటుడు, చిత్రనిర్మాత రజత్ కపూర్ తనను లైంగికంగా వేధించారంటూ తాజాగా జర్నలిస్టు సంధ్యా మీనన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. దీనిపై రజత్‌ కపూర్‌ ట్విటర్‌ వేదికగా క్షమాపణలు తెలిపారు. నేటి తరం రచయితలకు ఆదర్శంగా నిలిచే ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ కూడా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించారు. తనకు అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టేవారని, ఫోన్లు చేసేవారని ఆమె సాక్ష్యాధారాలుతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చేతన్ ఆమెతో పాటు, తన భార్యకు క్షమాపణ చెప్పుకున్నాడు. తాను చేసింది తప్పేనని, ఇలాంటి తప్పులు మళ్లీ చేయబోనని క్షణాపణ కోరాడు.

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న #మీటూ ఉద్యమంపై బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది పురుషుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అలా ప్రవర్తించడం మగవాళ్ల స్వభావం అన్నారు. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? అని ఉదిత్ రాజ్ ప్రశ్నించారు. మీటూ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? ఈ ఉద్యమం, ఆరోపణలు పేరుతో దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుడి నుంచి 2 నుంచి 4 లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అని ఆరోపించారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారని ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏళ్ల తరబడి మౌనంగా ఉండి, ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు ఇలా ఉద్యమం పేరుతో పురుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు…అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ వ్యాఖ్యల పట్ల కొందరు విమర్శిస్తే ఇంకొందరు సమర్ధిస్తున్నారు. వేధింపులు నిజమే కావచ్చు, కానీ అందరి ఆరోపణలనూ నిజమని నమ్మలేమంటున్నారు. అవకాశాల కోసం నాడు సైలెంట్ గా ఉండి, ఏళ్ల తర్వాత ఇప్పుడు అవకాశాలు లేక ఇలా ఆరోపించే వాళ్లూ లేకపోలేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ మీటూ ఉద్యమం దేశమంతా పెద్ద కలకలమే రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -