Monday, April 29, 2024
- Advertisement -

మూడు పార్టీల‌.. మూడు ముక్క‌లాట‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న మూడు కీల‌క‌పార్టీలు.. తెలుగుదేశం, వైసీపీ, జ‌న‌సేన‌లకు ఒక్కో ప్రాంతంపై ఒక్కొక్క‌రికి పట్టున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇదే మాదిరిగా.. రాష్ట్రంలోని మూడు ప్ర‌ధాన కులాలు.. ఈ మూడు పార్టీల‌కు కొమ్ముకాస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌లు మూడు ముక్క‌లాట‌ను త‌ల‌పిస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీకి స్ప‌ష్ట‌మైన ప‌ట్టు క‌నిపిస్తోంది. రాయ‌ల‌సీమలోని క‌ర్నూలు, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల‌తో పాటూ నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో వైసీపీకి మంచి ప‌ట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గాలి బాగా వీచిన స‌మ‌యంలోనూ ఈ ఐదు జిల్లాల్లోనే 41 సీట్ల‌ను వైసీపీ సాధించింది. మిగ‌తా ఎనిమిది జిల్లాల్లో క‌లిపి వైసీపికి వ‌చ్చిన సీట్లు.. 25 మాత్ర‌మే. ఈసారి కూడా ఇదే పంథా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పార్టీకి ఈ ఐదు జిల్లాల్లో మంచి ప‌ట్టుకొన‌సాగుతోంది. రెడ్డి సామాజిక వ‌ర్గం అత్య‌ధికంగా ఉన్న జిల్లాలు కావ‌డం కూడా వైసీపీకి క‌లిసొచ్చే అంశంగా మారింది. గ‌త ఎన్నిక‌ల కంటే క‌నీసం మ‌రో ఐదారు సీట్లు ఈ ఐదు జిల్లాల్లో పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఈసారి.. కృష్ణా, గుంటూరు, అనంత‌పురంలో స్ప‌ష్ట‌మైన ప‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ హ‌వా కొన‌సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు జిల్లాల్లో క‌లిపి 34 సీట్ల‌ను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం ప‌ట్టున్న జిల్లాలు కావ‌డంతో.. ఈ మూడింటిలోనూ తెలుగుదేశం పార్టీకి క‌లిసొస్తోంది. ఈసారి మ‌రో ఐదారు సీట్లు ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన ప‌శ్చిమ గోదావ‌రి, 13 సీట్లు గెలుచుకున్న తూర్పు గోదావ‌రిల్లో ఈసారి ప‌ట్టుకోల్పోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాపులు అత్య‌ధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ గండికొట్ట‌బోతోంది. జ‌న‌సేన పార్టీకి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో మంచి ప‌ట్టు పెరిగింది. కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌తో పాటూ.. మెగా కోట‌రీ అభిమానులు ఈ రెండు జిల్లాల్లో అత్య‌ధికంగా ఉన్నారు. అందుకే.. జ‌న‌సేన‌కు ఈ రెండు జిల్లాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాస‌ట‌గా నిల‌వ‌నున్నాయి.

ఉత్త‌రాంధ్ర నాడి మాత్రం ఇంకా ఎవ‌రికీ చిక్క‌డం లేదు. విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, శ్రీకాకుళం.. ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఓటర్ల నాడి ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. ఎవ‌రికి కొమ్ముకాస్తార‌నేది ఇంకొంత కాలం ఆగితే కాని తెలియ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఈ మూడు జిల్లాల్లో ప‌ట్టం క‌ట్టారు. మూడు జిల్లాల్లోని 34 సీట్ల‌లో తెలుగుదేశం పార్టీకి 24 వ‌చ్చాయి. మిగ‌తా ప‌దిలో 9 వైసీపీకి, ఒక‌టి బీజేపీకి వ‌చ్చాయి. ఈసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో.. ఉత్త‌రాంధ్ర‌లో ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మొద‌టి నుంచి ఉత్త‌రాంధ్ర‌లో సినీన‌టుడిగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్త‌రాంధ్ర‌లో మెగా అభిమాన సైన్యం చాలా పెద్ద‌ది. ఇటీవ‌ల ప‌వ‌న్ బ‌స్సుయాత్ర‌లోనూ అడుగడుగునా జ‌నం నీరాజ‌నాలు ప‌ట్టారు. మొద‌టి నుంచి ఉత్త‌రాంధ్ర తెలుగుదేశం పార్టీకి పెట్ట‌ని కోట‌గా ఉన్న‌ప్ప‌టికీ.. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దెబ్బ‌కు గండిప‌డింది. త‌ర్వాత మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైన మెజారిటీని సాధించింది. కానీ.. ఈసారి మ‌ళ్లీ ప‌వ‌న్ రాక‌తో ప‌రిస్థితి తారుమార‌వ్వ‌బోతోంది. జ‌గ‌న్‌కు కూడా ఈసారి ఉత్త‌రాంధ్ర‌లో సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -