Sunday, April 28, 2024
- Advertisement -

కేజ్రీవాల్ సూత్రమే కాంగ్రెస్ బ్రహ్మస్త్రం…ప్రత్యేక హోదాతోనే ఏపీలో పూర్వవైభవం

- Advertisement -

2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ బ్రహ్మాండమైన అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రయోగించిన అస్త్రమే ఆయనను రెండో సారి ముఖ్యమంత్రిని చేసింది. అది కూడా అలాంటి ఇలాంటి మెజార్టీతో కాదు. బీజేపీ, కాంగ్రెస్ సహా దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలన్నింటి కళ్లు బైర్లు కమ్మేస్థాయిలో ఘనవిజయం తెచ్చిపెట్టింది. కేజ్రీవాల్ ను రెండో సారి సీఎంను చేసిన ఆ అస్త్రం పేరు ‘క్షమాపణ’. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 70 స్థానాలుంటే వాటిలో బీజేపీ 31, ఆప్ 28, కాంగ్రెస్ 8,ఇతరులు 3 స్థానాలు గెల్చుకున్నారు. దీంతో కాంగ్రెస్, ఇతరుల మద్దతుతో మొదటి సారి 2013 డిసెంబర్ లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఎక్కువ రోజులు నడపలేకపోయారు. కాంగ్రెస్ అవినీతితో పాటు, ఆయన చేసే ప్రతి పనిలో కాంగ్రెస్ నేతలు వేలు పెట్టి, కేజ్రీవాల్ ను ఇరకాటంలో పెట్టేవాళ్లు. ఏమైనా అంటే మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరించే వాళ్లు. దీనికి తోడు మద్దతిచ్చిన ఇతర ముగ్గురు ఎమ్మెల్యేలతోనూ ఇబ్బందులు తప్పలేదు. దీంతో కేజ్రీవాల్ సీఎంగా 49 రోజులు మాత్రమే పని చేశారు. తర్వాత 2014 ఫిబ్రవరిలో రాజీనామా చేసేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని కోరారు.

అయితే మరోవైపు కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడంతో బీజేపీ ఢిల్లీలో డ్రామాలు మొదలు పెట్టింది. గవర్నర్ ను అడ్డం పెట్టుకుని, ఢిల్లీలో పెత్తనం కోసం ఏడాది పాటు నాటకీయ పరిణామాలను నడిపించింది. ఎన్నికలు జాప్యం చేసి, కేజ్రీవాల్ ను ఫెయిల్యూర్ సీఎంగా ప్రచారం చేసుకుని, మోడీ ఛరిష్మాతో ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ ఎన్ని చేయాలో అన్నీ చేసింది. మరోవైపు కేజ్రీవాల్ తాను తొందర పడ్డానని గ్రహించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో 28 సీట్లలో గెలిపించి, అధికారం కట్టబెడితే ఆవేశపడి, అనాలోచితంగా రాజీనామా చేసి తప్పు చేశానని ఆయన అంగీకరించారు. అదే విషయాన్ని తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. రాజీనామా చేసినందుకు క్షమించాలని ఢిల్లీ ప్రజలకు పదే పదే బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ సారి పూర్తి మెజార్టీ ఇవ్వండి. మంచి పాలన అందిస్తాను. గతంలో అరకొర సీట్లు రావడంతోనే అవినీతి పరుల మద్దతుతో ప్రభుత్వాన్ని నడపలేకపోయాను. రాజీనామా చేసేశాను. అయినా రాజీనామా చేసినందుకు మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చెప్పారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ క్షమాపణ చెప్పారు. దీంతో జనం కరుణించారు. సారీ చెప్పాడు కదా మరోసారి చాన్స్ ఇద్దామని 2015 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా మళ్లీ కూర్చోబెట్టారు. ఈ సారి ఏకంగా 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో 67 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. బీజేపీ, కాంగ్రెస్ ను చావుదెబ్బకొట్టారు.

రాష్ట్రాన్ని విభజించి తప్పు చేశామని, 2019లో ఏపీలోనూ రాహుల్ గాంధీతో కేజ్రీవాల్ మాదిరిగానే పదే పదే క్షమాపణ చెప్పించాలని ఏపీ కాంగ్రెస్ తో పాటు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ప్రత్యేకహోదా ఇస్తామనే హామీ ఇస్తే ఏపీ ప్రజలు క్షమాభిక్ష పెట్టి ఆదరిస్తారని ఆశ పడుతున్నారు. పైగా ఇప్పటికే యూపీఏ అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ఏపీకి ప్రత్యేకహోదాపైనే అని ఏఐసీసీ ప్రకటించింది. తప్పులు చేయడం మానవ సహజం. కానీ వాటిని బహిరంగంగా ఒప్పుకుని లెంపలేసుకుని క్షమాపణ చెబితే ఎవరైనా క్షమిస్తారనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అలా చెబితే మళ్లీ 2019లో అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రతిపక్షంలో అయినా కూర్చోవచ్చని, లేదంటే ప్రస్తుత సభలో లేనట్టు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెల్చుకోలేమని భావిస్తున్నారు. సో సారీ చెప్పేద్దాం ఏపీని గెలిచేద్దాం నినాదంతో ఏపీ కాంగ్రెస్ రంగంలో దూకుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -