జగన్ను ఓడించాలంటే అదొక్కటే దారి ?

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఎవరు ఊహించని రీతిలో 151 సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించారు వైఎస్ జగన్. ఇక ప్రస్తుతం జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయింది. అయితే ఈ మూడేళ్లలో జగన్ పరిపాలన ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయకేతనం ఎగురవేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీకి వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై అని చెప్పక తప్పదు. దాంతో టీడీపీ కూడా వచ్చే ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. ఇక జనసేన విషయానికొస్తే.. గతంతో పోలిస్తే జనసేన హవా జనంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెలువడుతున్న సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరి జగన్ను ఓడించాలంటే విపక్ష పార్టీలు అంతకు మించి ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ” మహాఘట్ బంధ్ ” అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. మహాఘట్ బంధ్ అనేది ప్రస్తుతం బిహార్ లో ఉన్న ఒక కూటమి. ఈ కూటమిలో జేడీయూ, ఆర్జేడి, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతరత్రా పార్టీలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ కి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. గతంలో ఎన్డీయే కూటమితో ప్రభుత్వంలో ఉన్న జేడీయూ.. ఎన్డీయే నుంచి తెగతెంపులు చేసుకొని,, మహాఘట్ బంధ్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. దాంతో బిహార్ లో బీజేపీ కి చెక్ పడింది.

ఇక ఏపీలో కూడా ఇదే విధంగా ఏపీలో రాబోయే ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ ఏకమైతేనే వైసీపీ అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ఉండవల్లి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఏపీ లో విపక్షాల తరుపున తెలుగుదేశం, జనసేన పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా పొత్తు విషయంలో ఎప్పటినుంచో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాయి. ఇక బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇక కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కూడా ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

మరి కాంగ్రెస్ అంటారా.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉందనే విషయమే చాలా వరకు అందరూ మర్చిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ కు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మాత్రమే కూటమిగా ఏర్పడాల్సి ఉంటుంది. బీజేపీ ఉన్న కూటమిలో వామపక్షాలు కలిసే అవకాశం లేదు. ఒకవేళ వామపక్షాలతో జనసేన, టీడీపీ కలిస్తే బీజేపీ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహాఘట్ బంధ్ అనేది ఏపీలో సాధ్యం కాదనే అభిప్రాయాలను విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తు విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగితే.. ఓట్ల చీలిక విషయంలో కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికి.. వైసీపీకి చెక్ పెడతారా ? అంటే అనుమానమే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు విపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతాయో చూడాలి.

Also Read

తెలంగాణకు శత్రువు మోడీనే !

అర్ధం కానీ “రాహుల్ “..!

మోడీ టార్గెట్ ఎవరు..?

Related Articles

Most Populer

Recent Posts