Sunday, April 28, 2024
- Advertisement -

4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ బిగ్ ఫైట్

- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే ప్రశ్నకు, ఇంకెప్పుడు నవంబర్ లోనే అనే సమాధానం వినిపిస్తోంది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో వాస్తవ కాల పరిమితి కంటే ముందే అసెంబ్లీ రద్దయితే, మొదటి ప్రాధాన్యత, ఆ రాష్ట్రానికే ఇచ్చి ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా 9నెలల గడువున్నా, అసెంబ్లీని రద్దు చేసుకుని, ముందస్తుకు వెళ్లారు. దీంతో గతంలో సుప్రీం చెప్పిన ప్రకారం, షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నాలుగు రాష్ట్రాలకు డిసెంబర్ లో ఎన్నికలు జరపటానికి ఈసీ ఏర్పాట్లు చేసుకుంది. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేసింది. కానీ జమిలీ ఎన్నికలు జరగపోయినా, ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది.

ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అక్టోబర్ నెలలోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్ కనిపిస్తోంది. ఆ తర్వాత నవంబర్ ఆఖరి వారంలో ఎన్నికల నిర్వహణ చేపట్టవచ్చు. దేశవ్యాప్తంగా కొత్త ఓటర్ల చేర్పు, పాత ఓటర్ల స్థానాల మార్పు వగైరా అవసరాల కోసం వచ్చే ఏడాది జనవరి 4 ఆఖరి తేదీగా గడువు విధించారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఓటర్లు ఆలోగా ఓటరు జాబితాలో సవరణ చేసుకోవచ్చని ఆదేశించారు. కానీ తెలంగాణలో అసెంబ్లీ రద్దుతో ముందుగా ఎన్నికలు జరపాల్సి రావడంతో, ఓటరు జాబితా సవరణ గడువును కూడా మార్చారు. అక్టోబర్ 8వ తేదీ ఆఖరి రోజుగా డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అంటే ఆ లోగా సవరణ ప్రక్రియ ముగిసిపోతే, అక్టోబర్ 10 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

మరోవైపు నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రమంతటా వీవీ ప్యాట్ యంత్రాలు, ఈవీఎం మిషన్లు పంపిణీ చేయాలని భెల్ కంపెనీకి ఆదేశాలు ఈసీ నుంచి వెళ్లాయి. ఇప్పటికే 44వేల యంత్రాలు రెడీగా ఉన్నాయని సమాచారం. వాటిని 4 రోజుల్లో జిల్లా కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని గోదాములకు తరలించే ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న 37వేల పోలింగ్ కేంద్రాలు చాలకపోవచ్చనే అంచనాలు కూడా ఉండటంతో, మరో 3వేల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఓటర్లు పెరుగుతారనే ఈ అంచనా. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 14వందల మంది ఓట్లు వేయవచ్చు. ఇలా అన్ని పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశమై ఎన్నికల అంశాలపై చర్చించే కేంద్ర ఎన్నికల కమిషన్, బహుశా ఈ వచ్చే మంగళవారమే తెలంగాణ ఎన్నికల ప్రక్రియపై కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -