Tuesday, April 30, 2024
- Advertisement -

జంప్ జిలానీలకే కేసీఆర్ జై, పాతకాపులకు నై

- Advertisement -

ఆహా కేసీఆర్. ఓహో కేసీఆర్. ముందస్తు స్కెచ్ అదిరింది. అసెంబ్లీ రద్దు సూపర్ హిట్. ఆ వెంటనే టీఆర్ఎస్ అభ్యర్ధుల ఖరారు ఇంకా సూపర్ డూపర్ హిట్. అసలు దేశంలోనే ఎవరూ తీసుకోలేని నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. ఆయన దమ్మే దమ్ము. ఆయన ధైర్యమే ధైర్యం. కేసీఆర్ దూకుడుకు సాటెవరు ? అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 119 స్థానాలకు గానూ 105 స్థానాల అభ్యర్ధులను ప్రకటించేశారు. అబ్బో ఏం వ్యూహం ? ఏం చాణక్యం ? ఎంత ముందుచూపు ? ఈ దెబ్బతో ప్రతిపక్షాలు గల్లంతే. వాళ్లకు ఊపిరి కూడా సలపనంత వేగంగా కేసీఆర్ రాజకీయ వ్యూహం అదిరిపోయింది. గురువారం నుంచీ ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహా పలు యూ ట్యూబ్ చానెల్స్ ఇదే వరస పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తున్నారు. కేసీఆర్ అంటే భయంతోనో, భక్తితోనో భజన మొదలు పెట్టేశారు. అభ్యర్ధులను ప్రకటించేసినంత మాత్రాన వాళ్లేదో గెలిచేసినట్లే హడావుడి చేసేస్తున్నారు. కానీ ముందుంది ముసళ్ల పండగని ఒక్కరూ కేసీఆర్ కి చెప్పరే..

వాస్తవానికి కేసీఆర్ ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేయించిన ప్రగతి నివేదిక సభ అట్టర్ ఫ్లాపుతోనే జనంలో టీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తి బయటపడింది. 25లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా గులాబీదండు చేసిన ప్రయత్నాలు కేవలం రెండున్నర లక్షలకు అటూ ఇటుగా ఆగిపోయాయి. పాతికలక్షల మందిని సభకు తోలుకురావాలని బాస్ ఆదేశిస్తే అందులో పదో వంతు జనసమీకరణతోనే అనుచరులు చేతులెత్తేశారు. ఆ ఫెయిల్యూర్ సభ గురించి ఏ ఒక్క పేపర్, చానెల్, వెబ్ సైట్ కేసీఆర్ కు నివేదిక ఇవ్వదు. ఇప్పుడు అభ్యర్ధుల ప్రకటనతోనే కేసీఆర్ పార్టీ ఘనవిజయం సాధించేసినట్లు మళ్లీ మీడియా బాకాలూ ఊదేస్తోంది. కానీ అభ్యర్ధుల ప్రకటన వెనుక రాజుకోనున్న అసంతృప్తి సెగ గురించి మాత్రం నోరు విప్పడం లేదు.

2014లో తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 63 స్థానాల్లోనే విజయం సాధించింది. అంటే బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కింది. కానీ తర్వాత టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచిన 27 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష ద్వారా లాగేసుకుంది. తన మెజార్టీని టెక్నికల్ గా 90 స్థానాలకు పెంచుకుంది. ఇప్పుడు ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్ల లిస్టులో అలా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరినవారున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్లు 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధుల మీద విజయం సాధించినవాళ్లే. తమపై గెలిచిన ఇతర పార్టీల అభ్యర్ధులను టీఆర్ఎస్ లోచేర్చుకోవడంపై ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్ధులు పార్టీ అధినేత కేసీఆర్ మీద గరం గరం అవుతున్నారు. ఇప్పుడు మళ్లీ నేరుగా వారికే టికెట్లు ఇవ్వడంతో మరింత రగిలిపోతున్నారు. ఉద్యమకాలంతో తాము పార్టీ కోసం, రాష్ట్రం కోసం పోరాడామని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జెండాను మోసింది తామే, పార్టీ పునాదులు వేసింది తామేనని నినదిస్తున్నారు. అలాంటి తమను కాదని ఇలా ఇతరులకు టికెట్లు ఇవ్వడం కేసీఆర్ యూజ్ అండ్ త్రో మెంటాలిటీకి నిదర్శనమని మండిపడుతున్నారు. ఇక తాము ఇతర పార్టీలకు తెరవెనుకే కాదు, బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చి, టీఆర్ఎస్ ఓటమికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శపథం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -