Tuesday, April 30, 2024
- Advertisement -

నీకు ఇలాంటి సలహాలు ఇచ్చేదెవరు ?..ఇంతకుమించి రాజకీయం చేతకాదా ?

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 24న మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందుకే ఈ బంద్ అని చెప్పుకొచ్చారు. అన్నిపార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రబంద్ తో కేంద్రం దిగివస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేస్తుందని, విభజన హామీలు నెరవేర్చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర బంద్ తో చంద్రబాబు మీద ఒత్తిడి పెరిగిపోతుందని, హోదా కోసం పోరాడతాడని జగన్ సెలవిచ్చారు. అప్పటికీ హోదా రాకపోతే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు నిరాహార దీక్ష చేయాలని, తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అందుకు సిద్ధమని ప్రకటించారు.

పాదయాత్రలో ఉన్న జగన్ జాగ్రత్తగా రాసుకొచ్చి చెప్పిన ఈ స్పీచ్ వింటే తెలివైనవారికెవరికైనా ఒళ్లు మండటం ఖాయం. నిజమైన ఉద్యమకారులు కన్నెర్రజేయక తప్పదు. జగన్ కు ఇంతకు మించి రాజకీయం చేతకాదా ? అని అనుకుంటే అది వారి తప్పు కాదు. ఒక రోజు రాష్ట్ర బంద్ పాటిస్తే హోదా వచ్చేస్తుందా ? చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతుందా ? ప్రత్యేకహోదా వచ్చేస్తుందా ? అదే నిజమైతే ఒక రోజు ఏం ఖర్మ! పది రోజులు, నెల రోజులైనా స్వచ్ఛంద బంద్ చేయడానికి ఆరుకోట్ల ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం జగన్ కు తెలియనది కాదు. కాకపోతే ఏదో పోరాటం చేస్తున్నాం. జనంలో ఉన్నాం. అని తమ పార్టీ ఆరాటాన్ని ప్రదర్శించుకోవడానికే ఈ రాష్ట్ర బంద్. అంతే తప్ప బంద్ వల్ల చంద్రబాబు, మోడీకి వీసమెత్తు నష్టం జరగదు. ఏమాత్రం ఒత్తిడీ ఉండదు అనే సంగతి జగన్ కు తెలియనిదా ? బంద్ వల్ల నష్టపోయేది, కష్టపడేది సామాన్యులే. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, రోగులు, వృద్ధులు, కూలీలు, నిరుపేదలే. ఒక్కరోజు బంద్ వల్ల కోట్ల మంది సామాన్యుల బతుకుబండి ఆగిపోతుంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు, నాలుగు మెతుకుల కోసం ఆ రోజు అల్లాడిపోతాయి. కానీ జగన్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు, మోడీకి వెంట్రుక కూడా తెగదు. మరి బడుగు బలహీనులను ఇబ్బందుల పాల్జేసి, జగన్ పార్టీ సాధించేదేమిటి ? జనంలో మరింత అసంతృప్తి, వ్యతిరేకత తప్ప.

నిజంగా జగన్ కు ఆయన పార్టీ నేతలకు అంత పోరాడాలని ఉంటే ఢిల్లీ వెళ్లి బంద్ కు ప్రయత్నించండి. మోడీ ఇంటి ముందు నిరాహార దీక్షలు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపజేయండి. రైల్వే వ్యవస్థను అడ్డుకోండి. తమిళనాడుకు తాగునీటి సరఫరాను నిలిపేయండి. బీఎస్ఎన్ఎల్, పోస్టల్ సహా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తాళాలు వేయండి. ఏపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను గృహనిర్భంధం చేయండి. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కమిట్ మెంట్ ఉన్నట్టు నటించే ప్రయత్నమైనా చేయండి. అంతే కానీ రాష్ట్ర బంద్ పాటిద్దాం. మోడీ మెడలు వంచేద్దాం. చంద్రబాబును దించేద్దాం. హోదా సాధించేద్దాం..లాంటి అరిగిపోయిన, సోది డైలాగులు పదే పదే చెప్పకండి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ ఇంగ్లిష్, హిందీలో మోడీతో సహా, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ నాయకులకు అర్థమయ్యే రీతిలో చెడుగుడు ఆడేశారు. మీ పార్టీ నాలుగేళ్లుగా ఊదరగొడుతున్నా చేయలేని సాధించలేని క్రెడిట్ వాళ్లు ఒక్కరోజులో సంపాదించేశారు. ఇలాంటప్పుడు మళ్లీ రాష్ట్రబంద్ అంటూ క్రీస్తుపూర్వం నాటి పోరాటపంథాతో మీరు సాధించేదేమీ ఉండదు. సామాన్యుల్లో మీ పార్టీపై ఆగ్రహం తప్ప. సో జగన్ ఇప్పటికైనా కాస్తా డిఫరెంట్ గా, ఉన్నతంగా ఆలోచించండి. బంద్, బొంద, అంటూ చౌకబారు సలహాలు ఇచ్చే మీ కోటరీని దూరంగా పెట్టండి. జల్లికట్టు లాంటి మహా ఉద్యమాన్ని వీలైతే ప్రారంభించండి. జనం మద్దతు సంపాదించండి. అంతే కానీ సామాన్యులను ఇబ్బంది పెట్టే తొక్కలో బంద్ లు, ధర్నాలతో మీరు సాధించేది ఏమీ ఉండదు, వారిలో ఆగ్రహావేశాలు తప్ప అని గ్రహించండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -