Sunday, April 28, 2024
- Advertisement -

మరి వైఎస్ఆర్ సీపీ రాష్ట్రబంద్ వల్ల ?

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోంది. సామాన్య ప్రజలను ఇబ్బందుల పాల్జేసే స్ట్రాటజీతో ఆ పార్టీ ఏం సాధిస్తుందో అర్ధం కావడం లేదు. టీడీపీ తీరు వల్ల ఆర్టీసికి తీవ్ర నష్టాలు వచ్చాయని, ధర్మపోరాట దీక్షల పేరిట 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకూ ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసిని టీడీపీ చేపట్టే దీక్షల కోసం వాడుకుని, మరింత నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. చంద్రబాబు ధర్మపోరాటం దీక్షల పేరుతో కోట్ల సొమ్ము వృథా చేశారని, కానీ వారి పోరాటంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కేంద్రం దిగిరాలేదని, హోదా ఇవ్వలేదని చెప్పుకొస్తున్నారు. వారిలా తమ పార్టీ చేయదని చెప్పారు. చిత్తశుద్ధితో పోరాడుతుందని తెలిపారు. అందుకే రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం రేపు మంగళవారం 24వ తేదీని తమ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే నిరసనగా తాము రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన బంద్‌కు సహకరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టీడీపీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలన్నారు.

అయితే శ్రీకాంత్ రెడ్డి చెప్పినదాంట్లో స్పష్టత కానరావట్లేదు. దీక్షల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ వృథా చేసిందని ఆయన ఆరోపించారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసిని మరింత నష్టాల్లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి మంగళవారం వైఎస్ఆర్ సీపీ బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్రబంద్ వల్ల ప్రత్యేకహోదా వచ్చేస్తుందని, విభజన హామీలు అమలైపోతాయని ఆ పార్టీ చెప్పగలదా ? అంటే సమాధానం ఉండదు. బంద్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తడి ఉంటుంది. సమస్యలు పరిష్కారమైపోతాయని చెప్పుకొస్తున్నారు. కానీ అది అవాస్తవమేనన్న సంగతి ఆ పార్టీ ఆఫీస్ లోని బోయ్ తో సహా అందరికీ తెలిసిందే. రాష్ట్ర బంద్ వల్ల ఒత్తిడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కాదు. సామాన్య ప్రజల మీద ఉంటుంది. ఆర్టీసికి ఒక రోజు ఆదాయం గండి పడుతుంది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసిని టీడీపీ మరింత నష్ట పరిచిందని చెప్పే, వైస్ఆర్ సీపీ బంద్ వల్ల ఆర్టీసీ ని మరిన్ని నష్టాల్లో ముంచుతోందా ? లాభాల్లో నడిపిస్తుందా? ఇక్కడ బంద్ పేరుతో ఆర్టీసీని, సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులను ఇబ్బంది పాల్జేయడం తప్ప వైఎస్ఆర్ సీపీ సాధించేదేమీ ఉండదు. పైగా ఇలా ఎదుటి పార్టీలో ఏ తప్పులైతే ఎత్తి చూపుతున్నారో, అవే తప్పులను వీళ్లూ చేయడం ఏం రాజకీయమో అర్థం కాదు.

.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -