Thursday, May 2, 2024
- Advertisement -

ధావ‌న్‌, రాహుళ్ ఇద్ద‌రిలో టెస్ట్‌లో ఎవ‌రికి చోటు ద‌క్క‌నుంది..?

- Advertisement -

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లీ సేన సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ నెగ్గాలని కసితో ఉన్న కోహ్లి సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తోంది. తొలి టెస్టు దగ్గర పడుతున్న కొద్దీ జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.

వర్షం కారణంగా ఆదివారం టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయ్యింది. సోమవారం వరుణుడు ఎలాంటి ఆటంకం కలిగించకపోవడంతో కోహ్లీ సేన ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. అయితే తుది జ‌ట్టులో ధావ‌న్‌, రాహుళ్ ఇద్ద‌రిలో ఎవ‌రు ఉంటార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఓపెనింగ్ కోసం మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు. టెస్టు స్పెషలిస్ట్ అయిన విజయ్ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా.. అతడికి జతగా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టుల్లో ధావన్ రికార్డ్ పేలవంగా ఉంది. ఆరు ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 122 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 37 మాత్రమే.

మరోవైపు ఇంగ్లాండ్ గడ్డ మీద తొలి టెస్టు ఆడేందుకు రాహుల్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. తొలి టీ20లో సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన ఈ ఆటగాడు.. మిగతా మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటి వరకూ 34 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఈ బెంగళూరు బ్యాట్స్‌మెన్ 43.58 సగటుతో 1438 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఓపెనింగ్ భాగస్వామ్యం విషయానికి వస్తే.. విజయ్, ధావన్ కలిసి 39 ఇన్నింగ్స్‌ల్లో 44.18 సగటుతో 1678 పరుగులు చేశారు. విజయ్, రాహుల్ కలిసి 20 ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు 471 పరుగులు జోడించారు. ధావన్, రాహుల్ జోడి 9 ఇన్నింగ్స్‌ల్లోనే 581 పరుగులు చేశారు. కానీ వీరిద్దరూ ఇంత వరకూ ఆసియా, వెస్టిండీస్ వెలుపల ఓపెనర్లుగా కలిసి ఆడలేదు. దీంతో ఈ ముగ్గురిలో ఎవర్ని ఓపెనర్లుగా పంపాలనే విషయం కోహ్లికి తలనొప్పిగా మారింది. అయితే కోహ్లీ ఎవ‌రిమీద మొగ్గు చూపుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -