Wednesday, May 1, 2024
- Advertisement -

రివ్యూ: ‘క‌ర్త‌వ్యం’ బోధించిన సినిమా

- Advertisement -

త‌మిళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన సినిమా.. భిన్న‌మైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన సినిమా.. ఈ శుక్ర‌వారం పెద్ద సినిమాల్లో న‌య‌న‌తార న‌టించిన ‘క‌ర్త‌వ్యం’ సినిమా ఒక్క‌టే విడుద‌ల కావ‌డంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్‌ ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లు ఈ సినిమాను విడుద‌ల చేయ‌డంతో ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ‘ఆర‌మ్‌’ సినిమాను డ‌బ్బింగ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల కోసం ‘క‌ర్త‌వ్యం’గా ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!

క‌థ: యువ ఐఏఎస్ అధికారిణి మ‌ధువ‌ర్షిణి (న‌య‌న‌తార‌) నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకుంటుంది. స‌ముద్రంతోపాటు.. అంత‌రిక్ష ప్ర‌యోగాల‌తో ప్రపంచ దృష్టిని ఆక‌ర్షించిన ఈఆ ప్రాంతంలోనే నీటి కరవు ఉండ‌డంపై ఆమె స్పందిస్తుంది. గ్రామాల‌కు తాగునీరు అందేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో ఓ ఊళ్లో ధ‌న్సిక అనే పాప బోరు బావిలో ప‌డిపోతుంది. ఈ విష‌యం తెలుసుకున్న ఆమె త‌న సిబ్బందితో క‌లిసి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఆ త‌ర్వాత పాప‌ను ర‌క్షించడానికి వ‌చ్చిన ఇబ్బందులు ఏమిటి? క‌లెక్ట‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? ధ‌న్సిక‌ బోరుబావిలో నుంచి బ‌య‌ట‌కు తీశారా? ఆ త‌ర్వాత క‌లెక్ట‌ర్ ఏం చ‌ర్య‌లు తీసుకుందో సినిమా చూడాలి.

క‌థ‌నం: క‌థ‌ను ఓ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించారు. త‌ర‌చూ జ‌రిగే ఈ బోరు బావి ఘ‌ట‌న‌ను తీసుకొని ద‌ర్శ‌కుడు సినిమా రూపొందించారు. రెండు గంట‌లపాటు భావోద్వేగంతో కూడిన వినోదం పండించడానికి ద‌ర్శ‌కుడు కృషి చేశాడు. అంత‌రిక్షంలోకి రాకెట్ల‌ని పంపేంత ప‌రిజ్ఞానాన్ని సంపాదించిన మన ద‌గ్గ‌ర.. బోరు బావిలో పిల్ల‌లు ప‌డిపోతే వాళ్ల‌ని ప్రాణాల‌తో బ‌య‌టికి తీసేంత సాంకేతిక స‌దుపాయాలు లేవా? అని ప్ర‌శ్నిస్తూ ఈ సినిమా తీశారు. క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార ఒదిగిపోయారు. పేద కుటుంబం నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వుతుంది. అత్తెస‌రు సంపాద‌న‌తో రోజులు నెట్టుకొచ్చే జీవితాల్లోని సంఘ‌ర్ష‌ణ‌, ఆశ‌లు, ఆప్యాయత‌ల్ని తెర‌పై చ‌క్క‌గా చూపించాడు. పాప బోరు బావిలో ప‌డడం నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. ప్ర‌మాదం జ‌రిగాక జ‌రిగే కార్య‌క్ర‌మాలు, అధికారుల ప‌నితీరు త‌దిత‌ర ప్ర‌తి అంశాన్ని సినిమాలో స‌హ‌జంగా తీశారు. క‌థ‌లో ఎక్క‌డా ఉత్కంఠ త‌గ్గ‌కుండా సినిమా తీర్చిదిద్దారు. రాసుకున్న క‌థ‌, ప్రేక్ష‌కుల‌కు ఏం చెప్పాలో ద‌ర్శ‌కుడు సూటిగా చెప్పాడు.

న‌టీన‌టుల తీరు: క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార న‌ట‌న సినిమాకు హైలెట్‌. ఇచ్చిన పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేసింది. పాత్ర వ్య‌వ‌హ‌రించే తీరులాగే, వ్య‌క్తిగ‌తంగా కూడా ఆమె క‌థ‌లోని సామాజిక కోణానికే క‌దిలిపోయి న‌టించేందుకు ఒప్పుకొన్నారేమో అనిపిస్తుంది. న‌య‌న‌తార మిన‌హా మిగిలిన పాత్ర‌ధారులంతా కొత్త‌వాళ్లే. అదే సినిమాకి స‌హ‌జత్వం తీసుకొచ్చింది. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు ప‌డ‌తాయి. సినిమాటోగ్రాఫర్ ఓం ప్ర‌కాశ్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్ సినిమాకు ప్ల‌స్స‌య్యారు. ప్ర‌తి స‌న్నివేశానికీ సంగీతం, కెమెరా ప‌నితనంతో సినిమా చ‌క్క‌గా తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం భావోద్వేగాన్ని ర‌గిలించింది.

నటీనటులు: నయనతార, విఘ్నేశ్‌, రమేశ్‌, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్ కృష్ణన్ త‌దిత‌రులు
కథ, దర్శకత్వం : గోపి నైనర్‌
సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్ (నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్‌ ట్రైడెంట్ ఆర్ట్స్)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -