Tuesday, May 7, 2024
- Advertisement -

ఆంధ్ర‌లో కేసీఆర్ గుళాబీ ద‌ళం పోటీ చేసేంత సీనుందా !

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు కేసీఆర్ లాంటి గొప్ప ముఖ్యమంత్రి లేర‌ని బాధ‌ప‌డుతున్నారా..? ఆయ‌న‌లాంటి ఓ ముఖ్య‌మంత్రి త‌మ‌కూ ఉండుంటే.. తామూ ఎంచ‌క్కా హాయిగా భోగ‌భాగ్యాల‌తో తుల‌తూగొచ్చ‌ని అనుకుంటున్నారా..? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాట‌లు వింటే ఆంధ్ర ప్ర‌జ‌లు కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి కోసం ముఖం వాచిపోయి ఎదురుచూస్తున్న‌ట్టు అనుకోవాల్సిందే. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌లో రూ.5 కోట్ల‌తో చేప‌ట్టబోయే అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి ఓ కొత్త విష‌యం వెళ్ల‌డించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకుంటే బాగుంటుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు బ‌లంగా కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట స‌మితి ఏపీలోనూ పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయంటూ కేటీఆర్ వెళ్ల‌డించారు. అయితే.. ఒక‌వైపు స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ పూర్తిగా వెన‌క‌బ‌డిపోయిందంటూనే.. మ‌రోవైపు ఆంధ్ర ప్ర‌జ‌లు త‌మ తండ్రి లాంటి సీఎం కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న‌ట్టు కేటీఆర్ అన‌డం హాస్యాస్ప‌దంగా ఉంది.

తెలంగాణ ఏర్ప‌డి నాలుగేళ్లు దాటినా.. ఇప్ప‌టికీ కేసీఆర్‌, కేటీఆర్ స‌హా తెలంగాణ రాష్ర్ట స‌మితి ప్ర‌ధాన ఆయుధం ఆంధ్ర పాల‌కుల‌ను తిట్ట‌డ‌మే. ఆంధ్ర పాల‌కుల‌ను తిట్టి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌లో ఉద్య‌మ వేడి చ‌ల్లార‌కుండా చేస్తూ.. మ‌రోసారి అధికారంలోనికి రావాల‌ని ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఆంధ్ర పాల‌కులు, ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర వ్యాపారులంట‌.. నోరు విప్పితే ఇప్ప‌టికీ.. కేసీఆర్ కుటుంబం విషం క‌క్కుతూనే ఉంటుంది. అంతెందుకు స‌మైక్యాంధ్ర ఉండాల‌ని కోట్లాది మంది ఆంధ్రులు బ‌లంగా కోరుకున్నారు. అలాంటిది కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కు కావాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అంటూనే.. స‌మైక్యాంధ్ర‌లో తెలంగాణ‌లోని పాల‌మూరు లాంటి జిల్లాలు అత్యంత మోస‌పోయాంటూ కేటీఆర్ ప్ర‌క‌టించారు. అంటే.. ఆంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభీష్టాన్ని ఒక‌వైపు విమ‌ర్శిస్తూనే.. తెరాస‌ను అక్క‌డా పోటీ చేయాల‌ని కోరుకుంటున్నార‌న‌డం గ‌మ‌నార్హం.

అంటే.. కేసీఆర్ అంత‌టి స‌మ‌ర్థుడైన ముఖ్య‌మంత్రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లేడ‌ని కేటీఆర్ భావిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ల‌లేని మొడెంలా.. నిధులు లేని పాల‌న‌లా మార‌డానికి కార‌ణం ఎవ‌రో అంద‌రికీ తెలిసిందే. చివ‌రాఖ‌రుకు.. మొన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల సాధ‌న‌కు.. ప్ర‌త్యేక హోదా కోసం బీజేపీపై పార్ల‌మెంట్ సాక్షిగా పోరాటం చేసిన‌ప్పుడు కూడా.. కేసీఆర్ గులాబీ ద‌ళ‌మే అడ్డుగా నిలిచింది. బీజేపీకి ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలిచి.. ఆంధ్ర‌ను మోసం చేసిన వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు. అలాంటి కేసీఆర్ వ‌చ్చి త‌మ‌ను ఉద్ధ‌రిస్తాడ‌ని ఆంధ్ర‌ప్ర‌జ‌లు ఎదురుచూసే ప‌రిస్థితి ఉందా. కేవ‌లం త‌మ తండ్రిని హీరోను చేసేందుకు.. రాష్ట్రాలుగా విడిపోయినా.. ఇప్ప‌టికీ ఆంధ్ర పాల‌కులు, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించే ఇలాంటి మాట‌ల‌ను కేటీఆర్ మానుకుంటే ఇరు ప్రాంతాల‌కూ మంచిది. అస‌లు కేసీఆర్ అంత డ‌బ్బులుండి, నిధులొచ్చి తెలంగాణ‌లో పొడిచిందేమిటి.. నిధులు లేక‌, ఆస‌రా లేక‌, కేంద్రం చిన్న‌చూపు, వివ‌క్ష‌ను త‌ట్టుకుని మ‌రీ చంద్ర‌బాబు చేయ‌లేక‌పోయింది ఏంట‌నే ప్ర‌శ్న‌కు కేటీఆర్ స‌మాధానం చెప్ప‌గ‌లిగితే.. అప్పుడు ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -