Monday, April 29, 2024
- Advertisement -

ఈ ఎన్నిక‌ల ఫ‌లితంతోనైనా బీజేపీ నేర్చుకునేనా..?

- Advertisement -
  • ఏపీలో విస్త‌రించే అవ‌కాశం ఉన్నా విస్మ‌ర‌ణ‌

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో క‌మ‌లం విక‌సించ‌డంతో బీజేపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా బాణ‌సంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాము హీరోల‌మ‌వుతామ‌ని జోస్యం చెప్పారు. అంటే చంద్ర‌బాబుతో సత్సంబంధాలు కొన‌సాగిస్తార‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. అంతేగానీ స్వ‌త‌హాగా పోటీచేసి గెలుపొందుతామ‌ని మాత్రం చెప్ప‌డం లేదు.

చంద్ర‌బాబు ఎన్ని అవ‌మానాలు చేసినా తెలుగుదేశంతో దోస్తీ చేస్తామ‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబుతో జోడీ క‌ట్టిన ప్ర‌తిసారి బీజేపీ న‌ష్ట‌పోతూనే ఉంది. ఈ విష‌యంలో ఆ పార్టీ నాయ‌కులు లోలోప‌ల మ‌ద‌న‌ప‌డుతున్నారు. పైపైకి విమ‌ర్శ‌లు చేస్తున్నా పెద్ద‌గా మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన మాదిరి బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. అంత సాహ‌సానికి ప్ర‌య‌త్నించ‌డం లేదు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర మోదీ హ‌వా దేశ‌వ్యాప్తంగా భారీగానే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఉంది. పైగా కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డం.. కాంగ్రెస్ పాల‌న అవినీతిమ‌యం కావ‌డంతో బీజేపీ బ‌లోపేతం అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. సొంతంగా బీజేపీ పోటీ చేసి ఉంటే క‌నీసం దాదాపు 20 ఎమ్మెల్యే స్థానాలు, 5 పార్ల‌మెంట్ స్థానాలైనా వ‌చ్చేవి.

పైగా ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తు సంద‌ర్భంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు బీజేపీ నాయ‌కుల‌కు తెలిసిందే. పొత్తు సంప్ర‌దాయం పాటించ‌కుండా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ పోటీ చేసే స్థానాలు ఎక్కువ‌గా, బీజేపీకి అర‌కొర ఇచ్చాడు. ఇచ్చిన స్థానాల్లో అంత ప్రాధాన్యం లేనివి కూడా. దీంతో అప్పుడే బీజేపీ నాయ‌కులు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు. కానీ త‌ర్వాత మిన్న‌కుండిపోయారు.

ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో గెలిచిన ఐదుగురి బీజేపీ ఎమ్మెల్యేలను త‌న పాల‌న‌లో ఏనాడూ చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో పొత్తు సంప్ర‌దాయం పాటించ‌లేదు. ఎమ్మెల్సీ స్థానాలు ఒక్క‌టీ ఇవ్వ‌లేదు. పైగా పోల‌వరం, ప్ర‌త్యేక హోదా, రాష్ట్ర రాజ‌ధాని నిర్మాణం త‌దిత‌ర విష‌యాల్లో కేంద్రాన్ని ప్ర‌తిసారి టీడీపీ మంత్రులు, నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇంత చేస్తున్నా బీజేపీ నాయ‌కులు టీడీపీని చూస్తూ ఊరుకుంటున్నారు. కానీ టీడీపీపై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. త‌మ బాధ‌ను లోలోప‌ల దాచుకుంటున్నారు మిన‌హా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి టీడీపీ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేయ‌లేక బీజేపీ నాయ‌కులు కొట్టుమిట్టాడుతున్నారు. గుజ‌రాత్‌, హిమాచల్‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో విజ‌యంతో ఏపీలోని స్వ‌త‌హాగా పోటీ చేద్దామ‌ని ప‌లువురు బీజేపీ నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. సొంతంగా పోటీ చేస్తే మోదీ హవాతో అత్య‌ధిక స్థానాలు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము హీరోల‌మ‌వుతున్నామ‌ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -