Tuesday, April 30, 2024
- Advertisement -

ద్వితీయ శ్రేణి నాయకులకు ఏం చెబుతావ్ కేసీఆర్ ?

- Advertisement -

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే గంటల్లోనే 105 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు. మొత్తం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 14 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేదు. వివిధ కారణాలతో ఆ 14 స్థానాలు పెండింగ్ లో ఉంచారు. అందులో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు స్థానాలు ఉండగా, కేవలం ఉప్పల్‌లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన బేతి సుభాష్‌రెడ్డికి మళ్లీ గులాబీ బాస్ టికెట్ ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతనిధ్యం వహిస్తున్న మిగిలిన నాలుగు చోట్ల అంటే గోషామహల్, ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్‌, స్థానాలకు టీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో దిగుతారో ప్రస్తుతానికి తేల్చలేదు. అది కేవలం బీజేపీతో కేసీఆర్ కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం వల్లేననే విమర్శలు జోరందుకున్నాయి.

ఇక ఇద్దరు సిటింగులకు నిరాకరించారు. ఆందోల్ లో బాబూమోహన్ స్థానంలో జర్నలిస్ట్ చంటి క్రాంతికిరణ్ కు టికెట్ ఇచ్చారు. చెన్నూరులో ఓదేలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్ అభ్యర్ధిగా ఉంటారని ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల్లో వీరిపై తీవ్ర అసంతృప్తి ఉండడం వల్లే వారికి టికెట్లు నిరాకరించారని తెలిసింది. ఇక మరో ఐదు స్థానాల్లో సిటింగులకు ఏమీ చెప్పకుండా పెండింగులో పెట్టారు. వరంగల్ తూర్పు తాజా మాజీ కొండా సురేఖ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే సి.కనకారెడ్డి, వికారాబాద్ తాజా మాజీ సంజీవరావు, మేడ్చల్ తాజా మాజీ ఎం.సుధీర్‌రెడ్డి ఉన్నారు. వీరిపైనా స్థానిక గులాబీ శ్రేణుల నుంచి వ్యతిరేకత, పార్టీ మారతారనే వార్తలు రావడంతో వీరిని కేసీఆర్ పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురికి టీఆర్ఎస్ టికెట్లు రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే టికెట్లు ప్రకటించిన 105 స్థానాల్లో టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలు 90 మంది ఉన్నారు. వారిలో 83 మందికి మళ్లీ టికెట్లు ఖరారు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నే నమ్ముకుని ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇపుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీలో అవకాశమొస్తుందని ఆశించిన వారిలో అధికశాతం మంది వీరిలో ఉన్నారు. కానీ అనూహ్యంగా వేరేవాళ్లు టిఆర్ఎస్ టికెట్లు దక్కించుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. పోనీ రెండో అసెంబ్లీకి అయినా ప్రాతినిధ్యం వహిద్దాం, మొదటి చాన్స్ వీళ్లు కొట్టేసినా, పార్టీనే నమ్ముకుని ఉన్న తమకు కేసీఆర్ రెండోసారి అవకాశం ఇస్తాడని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగిన విధంగా గత నాలుగేళ్లుగా ఆర్ధికంగా, సామాజికంగా వీలైనంతవరకూ బలపడే ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా లేకపోయినా వీళ్లు అందుబాటులో ఉంటూ కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేశారు. ఒక చాన్స్ వాళ్లకు ఇచ్చారు కనుక, ఈ సారి ఎమ్మెల్యే టికెట్ తమకివ్వాలని పైరవీలు కూడా చేసుకున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని కొందరు అభ్యర్ధులు ముందే కేసీఆర్ కు విన్నవించుకున్నారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా, విస్మరించారని నిరాశకు గురైన ఆశావహులు మండిపడుతున్నారు. పదవులు సిట్టింగులకే రాసిపెట్టారా ? ఒకసారి ఎమ్మెల్యే, మంత్రి అయినవాళ్లే మళ్లీ మళ్లీ అవ్వాలా ? కొత్తతరాన్ని, యువనాయకత్వాన్ని ప్రోత్సహించరా ? మేం రాజకీయ నిరుద్యోగులగానే ఉండిపోవాలా ? సేవలకే తప్ప పదవులకు పనికిరామా ? అని ద్వితీయశ్రేణి నాయకులు ఇప్పుడు కేసీఆర్ పై మండిపడుతున్నారు.

ఇక గుర్తుంపు లేని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, అక్కడా టికెట్ దొరక్కపోతే రెబల్స్ గా ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలని భావిస్తున్నారు. సిట్టింగులకు టికెట్లు ఖరారైన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. వీరిని ఎలా బుజ్జగించి కేసీఆర్ దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి. లేదంటే కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -