Monday, April 29, 2024
- Advertisement -

డ్రీమ్ ప్రాజెక్టులు ఇవా..!

- Advertisement -

నువ్వు మార‌వా.. నువ్వు మార‌వురా.. ఈ డైలాగ్ వింటే ప్ర‌భాస్ మిర్చి సినిమాలో క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది. తాను ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఎన్ని ర‌కాలుగా చెప్పినా.. విల‌న్ విన‌క‌పోవడంతో కోపంతో ప్ర‌భాస్ ఈ డైలాగ్ చెబుతాడు. ప్ర‌స్తుతం తెలుగు సినీ ప్రేక్ష‌కులు సైతం ఇదే మాటంటున్నారు. తాము ఎన్ని ర‌కాలుగా అవ‌కాశాలిచ్చినా.. ఎన్ని పిచ్చి సినిమాలు చూస్తున్నా.. ఈ తెలుగు హీరో మార‌డం లేదు, ద‌ర్శ‌కుడు వినూత్నంగా ప్ర‌య‌త్నించ‌డం లేదు. అందుకే.. నువ్వు మార‌వా.. నువ్వు మార‌వురా.. అంటూ ఏ థియేట‌ర్‌లో సినిమా అయిపోయిన త‌ర్వాత చూసినా ఇదే సీన్ క‌న్పిస్తోందిప్పుడు. కొత్త‌గా తీశాం.. కొత్త‌గా ప్ర‌య‌త్నించామంటూ పాత మూస క‌థ‌ల‌ను కొంచెం అటూ ఇటూ మార్చి ప్రేక్ష‌కులపై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే.. ఇంక మీకు అవ‌కాశం ఇచ్చి దండ‌గ‌ని.. రోజు రోజుకూ థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమాను చూసే వారి సంఖ్య త‌గ్గిపోతోంది. అయినా.. వీళ్లు మార‌డం లేదు. వీరి పంథా ఇలాగే సాగితే.. స‌రిగ్గా మ‌రో రెండేళ్లు.. చాలు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలామంది క‌నుమ‌రుగైపోవ‌డం ఖాయం.

ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌. ఎప్ప‌టినుంచో ఎదురుచూసిన స‌మ‌యం వ‌చ్చింది. నా కెరీర్‌లోనే అతిపెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందంటూ.. గోపీచంద్ త‌న తాజా చిత్రం పంతం ఆడియో ఫంక్ష‌న్‌లో చెప్పాడు. గోపీచంద్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే.. ఎలా ఉంటుందోన‌ని అభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ప‌రుగులు తీస్తూ వెళ్లారు. తీరా.. వెళ్లాక‌.. ఆయ‌న డ్రీమ్ ఏంటో.. ఈ సినిమా ఏంటో అర్థం కాక‌.. కొంప‌దీసి ప‌క్క థియేట‌ర్‌కు వ‌చ్చేశామా.. అని త‌మ‌ను తాము గిల్లుకుని చూసుకోవాల్సి వ‌చ్చింది.

హీరో ప్ర‌పంచం ధ‌న‌వంతుల్లో ఒక‌రైన వ్య‌క్తి కొడుకు, అత‌ను స‌డెన్‌గా తండ్రికి దూరంగా వ‌చ్చేసి దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. అది కూడా ప‌ర‌మ నాసిర‌కమైన ప‌ద్ధ‌తుల్లో దొంగ‌త‌నం చేస్తూ.. వేల కోట్ల‌ను కొట్టేస్తుంటాడు. చివ‌రికి కొట్టిన‌దంతా.. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం అంద‌క ఇబ్బందిప‌డే బాధితుల‌కు పంచుతుంటాడ‌ట‌. చివ‌రిలో హీరో దొరికిపోతాడ‌ట‌.. కోర్టులో గోపీచంద్ త‌న పురాత‌న ఫేస్‌మేక‌ప్ స్టైల్‌లో ముఖ కండ‌రాల‌న్నింటినీ బిగించేసి.. నాలుగు డైలాగులు పేల్చేస్తాడ‌ట‌.. అయినా కోర్టులో అవేవీ నిల‌బ‌డ‌వు.. కేవలం ఒక విచార‌ణ అధికారి వ‌చ్చి చెప్ప‌డంతో.. న్యాయం జ‌రుగుతుంది.. విన‌డానికి అత్యంత బోరింగ్‌గా ఉన్న ఈ క‌థ‌తో తీసిన సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్ప‌డానికి గోపీచంద్ చాలా ధైర్య‌మే చేసినట్టున్నాడు. సినిమాలో లాజిక్ లేక‌పోతే లేదు.. క‌నీసం ఏదైనా మేజిక్ అయినా చేశారంటే.. అదీ లేదు. చ‌ప్ప‌గా సీన్లు, ఉప్పూ కారం లేని ఫీట్ల‌తో పేల‌వంగా.. మూడు రోజులకే మూటాముళ్లే స‌ర్దేసింది. ఇప్పుడు గోపీచంద్ అనుకోవ‌చ్చు.. నేను ఇంత గొప్ప‌గా తీసినా ఎందుకు ఆడ‌లేద‌బ్బా.. అని. కానీ.. ఇదే క‌థ‌తో ఇంత‌కంటే గొప్ప‌గా.. స‌రిగ్గా 25 ఏళ్ల కింద‌టే 1993లో శంక‌ర్ జెంటిల్మ‌న్ సినిమాను తీశాడు.

ఆ త‌ర్వాత‌.. ఇదే క‌థ‌తో కొన్ని వంద‌ల చిత్రాలొచ్చాయి. కొంప‌దీసి ఈ సినిమాల‌ను గోపీచంద్ చూడ‌లేదా.. అన్న అనుమానం క‌లుగుతోంది. అదే శంక‌ర్ మ‌ళ్లీ స‌రిగ్గా 11 ఏళ్ల కింద‌ట 2007లో శివాజీ మూవీ తీశాడు. జెంటిల్మెన్ స‌మ‌యంలో లేని అధునాత‌న టెక్నాల‌జీ, మ‌నీ హ‌వాలా వంటి వాటిని మిళితం చేసి తీశాడు. గోపీచంద్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట‌ని చెప్పి 30 ఏళ్ల కింద‌ట తీసినా.. ఆడుతుందో లేదో తెలియ‌ని క‌థ‌ను ఎంచుకోవ‌డం చూస్తే జాలిప‌డాల్సిందే. తాజాగా సాయిధ‌ర్మ‌తేజ్ కూడా త‌న పేరులోని చివ‌రి రెండు అక్ష‌రాల‌నే సినిమా పేరుగా పెట్టేసుకుని.. తేజ్.. ఐల‌వ్యూ అంటూ ఓ గొప్ప ప్రేమ క‌థా చిత్రం తీసిన‌ట్టు వేదిక‌లెక్కి ఊద‌ర‌గొట్టాడు. మాస్ నుంచి క్లాస్‌కు మారే ప్ర‌య‌త్నంలో భాగంగా అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌లో న‌టించానంటూ చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యం వ‌ర‌కూ హీరోయిన్‌తో క‌లిసి యాత్ర‌లు చేసి తెగ ప్ర‌చారం చేశాడు. తీరా చూస్తే.. ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తాను సినీ ఇండ‌స్ర్టీలోనికి పాతికేళ్ల కింద‌ట వ‌చ్చిన‌ప్పుడు రాసుకున్న క‌థ‌ను ఇప్పుడు సాయిధ‌ర్మ‌తేజ్‌తో తీసిన‌ట్టుంది. ఓ మ‌హిళ‌ను ఓ చిన్న కుర్రాడు కాపాడే ప్ర‌య‌త్నంలో ఓ వ్య‌క్తిని చంప‌డంతో.. బాల‌ల కారాగారానికి వెళ్లాల్సి వ‌స్తుంది.

ద‌శాబ్దం త‌ర్వాత స‌ద‌రు యువ‌కుడిని వెతుక్కుంటూ స‌ద‌రు ఆ మ‌హిళ కుమార్తె వ‌స్తుంది. కానీ.. ఆ యువ‌కుడి జాడ తెలియ‌దు. చివ‌రాఖ‌రుకు సినిమా ముగిసే స‌మ‌యానికి తాను వెతుక్కుంటూ వ‌చ్చింది, ప్రేమించింది ఒక‌రేన‌నే ట్విస్ట్ తెలుస్తుంది.. ఈ క‌థ‌, క‌థ‌నం న‌డిపిన విధానం కంటే క‌రుణాక‌ర‌న్ 20 ఏళ్ల కింద‌ట 1998లో ప‌వ‌న్‌తో తీసిన తొలిప్రేమ చాలా కొత్త‌ద‌నంతో ఉన్న‌ట్ట‌నిపిస్తుంది. ఈ రెండూ టాలీవుడ్‌లో వ‌చ్చిన తాజా చిత్రాలు క‌నుక వీటి గురించి చెప్పుకున్నాం. ఈ మ‌ధ్య‌న మ‌న యువ‌హీరోల‌ని చెప్పుకుంటున్న వాళ్లంద‌రి పంథా ఇలాగే ఉంది. ఇది త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది.. ట్రెండ్ మార్చి తీశాం.. అని చెబుతూ.. తీరా థియేట‌ర్‌కు వెళ్లాక చూస్తే తుస్సు మ‌నిపిస్తున్నారు.

అస‌లు లోపం ఎక్క‌డుంది..
టాలీవుడ్‌కు క‌థ‌లు క‌ర‌వ‌య్యాయి. అందుకే ఇలా తీస్తున్నాం. మీరు విమ‌ర్శించ‌డం కాదు.. మంచి క‌థ‌లుంటే తీసుకురండి.. తెలుస్తుదంటూ ఇటీవ‌వ‌ల ప్ర‌తి ద‌ర్శ‌కుడు, హీరో మాట్లాడి బోర్ కొట్టిస్తున్నారు. క‌థ‌లు లేవు స‌రే.. మ‌రి క‌థ‌నం, స్ర్కీన్‌ప్లేలో కొత్త‌ద‌నం చూపొచ్చు క‌దా.. అదికూడా మీ ద‌గ్గ‌ర లేదా. దానికి క‌ళాతృష్ణ‌, నైపుణ్యం కావాలి. అది ఉన్న‌వాళ్ల‌కు టాలీవుడ్‌లో క‌థ‌లు, హిట్ల‌కు కొదువ లేదు. త‌రుణ‌భాస్క‌ర్ పెళ్లిచూపుల సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైందంటూ స‌మాజంలో ఉండే నాలుగు వ్య‌క్తిత్వాల‌ను ప‌రిచ‌యం చేశాడు. అదీ సూప‌ర్‌హిట్ట‌యింది. అర్జున్‌రెడ్డి.. చిత్రం చూస్తున్నంత సేపూ ఓ బెస్ట్ టెక్నీషియ‌న్ ప‌నిత‌నం క‌నిపిస్తుంటుంది.

తాజాగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తీసిన స‌మ్మోహ‌నం చిత్రంలో క‌థేముంది. క‌థ‌నంతో వైవిధ్యంగా కొత్త‌గా ఓ ప్ర‌య‌త్నం చేసి విజ‌యం సాధించాడు. అన్నీ ఇలాగే తీయాల‌ని చెప్ప‌డం లేదు. కానీ.. క‌నీసం వంద సినిమాలొస్తే.. ఓ ప‌ది ఇలా తీయొచ్చు క‌దా. కానీ.. వందొస్తే.. వాటిలో ఒక‌టో అరో ఇలాంటివి ఉంటున్నాయి. అవే విజ‌య‌వంత‌మవుతున్నాయి. అంటే.. ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం కోరుకుంటున్నార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. అంద‌రూ బాహుబ‌లి లాంటి సినిమాలు తీయ‌లేక‌పోవ‌చ్చు. కానీ.. ఓ కొత్త ఫ్లేవ‌ర్‌ను అద్దొచ్చు క‌దా. పోనీ.. మాస్ క‌థ‌లు, సినిమాలే తీసినా.. కొర‌టాల శివ‌లా టెక్నిక‌ల్ వేల్యూస్‌ను జోడించొచ్చు. అదీ చేయ‌డం లేదు. చివ‌రికి హీరోల ప‌రువును గంగ‌పాలు చేస్తున్నారు. క‌థ‌, చిత్రంలో ప‌స ఎంతుంద‌నేది అర్థం చేసుకోలేక వారొచ్చి వేదిక‌ల‌పై ఊద‌ర‌గొట్టి.. త‌ర్వాత గాలొదిలేసిన బెలూన్ల‌లా మారుతున్నారు.

త‌మిళ తంబిలు కొత్త‌గా వెళ్తున్నారు..
కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఇప్ప‌టికే మూస‌కు దూర‌మైపోయింది. నాలుగు పాట‌లు.. మూడు ఫైట్ల సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టేసింది. తాజాగా విశాల్ క‌థానాయకుడిగా వ‌చ్చిన అభిమ‌న్యుడు సినిమా చూస్తే.. మొత్తం టెక్నాల‌జీని వాడేశాడు. సామాజికంగా మ‌నం ఎంత అభ‌ద్ర‌త‌గా బ‌తుకుతున్నామో వివ‌రించాడు. అంత‌కుముందు తీసిన డిటెక్టివ్‌లోనూ ఓ కొత్త లోకంలోనికి తీసుకెళ్లాడు. ఆలోకం మ‌న మ‌ధ్య‌లో ఉన్న‌దే. వంద‌లో 50 ఇలాగే ఓ కొత్త ఫ్లేవ‌ర్‌తో ఉంటున్నాయి. అంద‌రూ క‌మ‌ల్‌హాస‌న్‌లా వినూత్నంగా తీయ‌లేక‌పోవ‌చ్చు. కానీ.. వారికున్న ప‌రిధిలో అద‌ర‌గొడుతున్నారు. మ‌రి మ‌న‌వాళ్ల‌కు ఈ తెలివి ఎప్పుడొస్తుందో. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. మ‌న తెలుగు ద‌ర్శ‌కులు, హీరోలు రెండున్న‌ర గంట‌ల్లో చెబుతున్న క‌థ‌, క‌థ‌నాల కంటే.. కేవ‌లం అర‌గంట నిడివి ఉన్న షార్ట్‌ఫిల్ముల్లో కుర్రాళ్లు బాగా చెబుతున్నార‌నేది ప్ర‌స్తుత టాక్‌. అందుకే ఏదైనా సినిమా తీసేముందు మ‌నోళ్లు తెలుగులో వ‌స్తున్న షార్ట్‌ఫిల్ముల‌ను ఒక‌సారి చూస్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -