Monday, April 29, 2024
- Advertisement -

ఐసీసీ బిగ్‌-3 ఆదాయ పంపిణీ కోల్పోయిన బీసీసీఐ

- Advertisement -
ICC’s 400 million dollars offer to BCCI still on table

బీసీసీఐ ఏం చెబితే ఐసీసీలో అది చెల్లుబాటు కావాల్సిందే! భారత బోర్డు ఏమన్నా ప్రపంచ క్రికెట్లో మిగతా దేశాలన్నీ జీహుజూర్‌ అనాల్సిందే! ఇదీ చాలా ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ! కానీ ఇప్పుడు కథ మారింది! ప్రపంచ క్రికెట్‌పై భారత బోర్డు పట్టు సడలింది.

ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యానికి సంపూర్ణంగా తెరపడింది. ఐసీసీలో మూడేళ్ల కిందట భారత అభీష్టం మేరకు అమల్లోకి వచ్చిన బిగ్‌-3 ఆదాయ పంపిణీ విధానానికి చరమగీతం పాడేశాయి మిగతా సభ్యదేశాలు. బీసీసీఐ తరఫున ఐసీసీ ఛైర్మన్‌ అయిన శశాంక్‌ మనోహరే.. భారత్‌ ఆదాయానికి భారీగా గండికొట్టే ప్రక్రియలో కీలక పాత్రధారి అయ్యాడు. మిగతా దేశాల్ని ఏకతాటిపైకి తెచ్చి.. రెండేళ్లుగా అమల్లో ఉన్న బిగ్‌-3 ఆదాయ పంపిణీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేయించడంలో అతను విజయవంతమయ్యాడు.
ప్రపంచ క్రికెట్‌ ఆదాయంలో 80 శాతానికి పైగా భారత్‌ నుంచే వస్తున్న నేపథ్యంలో అందులో వాటా కూడా బీసీసీఐకే ఎక్కువ దక్కేలా మూడేళ్ల కిందట ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బోర్డుల సహకారంతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అప్పటి ఐసీసీ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ ప్రవేశ పెట్టిన ‘బిగ్‌-3’ ఆదాయ పంపిణీ విధానానికి తెరపడింది. గత ఏడాది బీసీసీఐ మద్దతుతో ఛైర్మన్‌ పదవి చేపట్టి, బీసీసీఐ ప్రయోజనాలనే దెబ్బ తీసే దిశగా ఈ విధానాన్ని మార్చేందుకు పట్టుబట్టి కూర్చున్న శశాంక్‌ మనోహర్‌ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. బిగ్‌-3 ఆదాయ పంపిణీ విధానం ప్రకారం భారత్‌కు 2015-23 మధ్య దాదాపు రూ.3667 కోట్ల ఆదాయం దక్కాల్సి ఉండగా.. ప్రస్తుత మార్పుతో అది సుమారు రూ.1866 కోట్లకు పడిపోతుంది. మధ్యలో బీసీసీఐని ఒప్పించేందుకు రూ.650 కోట్లు అదనంగా ఇచ్చేందుకు మనోహర్‌ చేసిన ప్రతిపాదనను అంగీకరించని నేపథ్యంలో అదీ భారత్‌కు దక్కనట్లే.
ఆదాయ పంపిణీ విధానాన్ని మార్చే ప్రక్రియ ఆరంభమైంది ఫిబ్రవరిలో. ఓటింగ్‌కు ముందు రెండు నెలలకు పైగా సమయం లభించింది. భారత్‌ తనవైపునకు మూడు బోర్డుల్ని తిప్పుకుంటే తీర్మానం వీగిపోతుంది. శ్రీలంక ముందు నుంచి భారత్‌ వైపుండగా.. బంగ్లాదేశ్‌, జింబాబ్వే లాంటి చిన్న బోర్డుల్ని తన వైపు తిప్పుకోవడం పెద్ద సమస్యేమీ కాదనే భావించారంతా. మధ్యలో దక్షిణాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్‌, జింబాబ్వే బోర్డుల పెద్దలు భారత్‌కు వచ్చి బోర్డు పాలక కమిటీతో సమావేశమయ్యారు కూడా. ఆ బోర్డులు మనవైపే ఉన్నాయన్న సంకేతాలు కూడా వచ్చాయి. కానీ ఓటింగ్‌కు వచ్చేసరికి లంక మినహా ఎవ్వరూ భారత్‌ వైపు లేరు. ఒకప్పుడు ఎన్నో అంశాల్లో మిగతా బోర్డుల మెడలు వంచి ఐసీసీలో తన మాట నెగ్గించుకున్న బీసీసీఐకి ఈ పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ వూహించి ఉండరు.
ఆదాయ పంపిణీ విధానం మార్పు తీర్మానం వీగిపోయేలా చేసేందుకు మిగతా బోర్డుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే గత నెలలో ఐసీసీ ఛైర్మన్‌ పదవికి శశాంక్‌ మనోహర్‌ రాజీనామా చేయడం అందరికీ పెద్ద షాకే! దీంతో భారత బోర్డు అప్పుడే సగం విజయం సాధించేసిందని అంచనా వేశారు. తన మాట నెగ్గబోదనే మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించారు. ఐతే కొత్త ఛైర్మన్‌ వచ్చే వరకు పదవిలో కొనసాగుతానంటూ.. మనోహర్‌ నడిపిన మంత్రాంగమే ఇప్పుడు చర్చనీయాంశవమవుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌, జింబాబ్వే బోర్డులకు భారీ తాయిలాలు ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. జింబాబ్వేకు 120 కోట్ల దాకా ఆదాయ వాటా దక్కుతుందని మనోహర్‌ హామీ ఇవ్వడం ద్వారా ఆ బోర్డు ఓటు తీర్మానానికి అనుకూలంగా వేయించాడని బీసీసీఐ ఆరోపిస్తోంది.
ఆదాయ పంపిణీ విధానంలో మార్పును అడ్డుకోవడానికి ఇప్పటిదాకా బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మార్పు దిశగా తీర్మానం ఆమోదం కూడా పొందింది. ఇప్పుడిక బీసీసీఐ ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. భారత్‌ ముందున్న తొలి ప్రత్యామ్నాయం.. ఛాంపియన్స్‌ ట్రోఫీని బహిష్కరించడం. భారత్‌ ఇప్పటికే గడువు లోపు ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించకపోవడం ద్వారా ఐసీసీ ప్రయత్నాల్ని అడ్డుకునే ఎత్తుగడ వేసింది. భారత్‌ ఆడలేదంటే ఛాంపియన్స్‌ ట్రోఫీనే కళతప్పడం, ఆదాయంలో భారీగా గండిపడటం ఖాయం. మున్ముందు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తే ఐసీసీకి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తవచ్చు. కానీ అన్నీ నిబంధనల ప్రకారం చేసుకుపోతున్న బీసీసీఐ పాలక కమిటీ ఆ దిశగా అడుగులేస్తుందా అన్నది సందేహం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. 2022 లో కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో..క్రికెట్‌
  2. ​కష్టాల్లో కొహ్లీ.. అందుకే గంగూలీ సలహాలు
  3. ఐపీఎల్-10లో మొదటి హ్యాట్రిక్
  4. 2 బంతుల్లో 18 పరుగులు.. ఐపీఎల్ లో ఇది సంచలనం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -